మార్చి 1 వరకు ఫాస్టాగ్ పై కేంద్రం సరికొత్త వెసులుబాటు..
నగదు రహిత లావాదేవీలు ప్రోత్సహించేందుకు కేంద్రం ఫాస్టాగ్ పద్ధతి తీసుకొచ్చింది. టోల్ గేట్ల వద్ద వేచి చూసే అవసరం లేకుండా, రద్దీ పెరగకుండా ఇది ఉపయోగపడుతుంది. టోల్ వసూళ్లలో కూడా పారదర్శకత ఉంటుంది. అయితే ఈ సాంకేతికతను అలవాటు చేసుకునేందుకు వాహనదారులు ఇబ్బంది పడ్డారు. దీంతో ప్రభుత్వం పదే పదే గడువు పొడిగిస్తూ వచ్చింది. తాజాగా ఫిబ్రవరి 15న దీనిపై తుది గడువు విధించడంతో ప్రజలు ఇబ్బంది పడ్డారు. మరోసారి పొడిగింపు ఉంటుందనుకున్నా కుదరదని కేంద్రం ఖరాఖండిగా తేల్చి చెప్పడంతో వాహనదారులు టోల్ గేట్ల వద్ద అష్టకష్టాలు పడ్డారు. ఈ దశలో ఫాస్టాగ్ నమోదుపై మాత్రం కేంద్రం వెసులుబాటు ఇచ్చింది.
అయితే ఫాస్టాగ్ తప్పనిసరి చేయడం ద్వారా కొత్తగా అందరూ దీనికి అలవాటు పడుతున్నారని చెబుతోంది ప్రభుత్వం. గత రెండు రోజుల్లో 2.5 లక్షల మంది కొత్తగా ఫాస్టాగ్ సదుపాయాన్ని పొందారు. 17వ తేదీ ఒక్కరోజే దేశ వ్యాప్తంగా సుమారు 60 లక్షల వ్యవహారాల్లో రూ.95 కోట్ల మేర టోల్ వసూలైందని జాతీయ రహదారుల నిర్వహణ సంస్థ పేర్కొంది. మార్చి 1 వరకూ అన్ని టోల్ ప్లాజాల వద్ద ‘ఉచిత ఫాస్టాగ్’ నమోదు చేపడుతున్నట్టు తెలిపింది.
మొత్తమ్మీద ఫాస్టాగ్ విషయంలో కేంద్రం తన పంతం నెగ్గించుకుంది. పదే పదే గడువు పొడిగించుకుంటూ పోకుండా దీనికి స్థిరమైన డెడ్ లైన్ విధించి మరీ ఫాస్టాగ్ అమలులో పెట్టింది.