జగన్, షర్మిల, భారతి పై ఆంధ్రజ్యోతి వార్తల అసలు కథ ఇదే..!?
ఆంధ్రజ్యోతి తాజా కథనంపై వైసీపీ స్పందించింది. పంచాయతీ ఎన్నికల్లో చతికిల పడిన టీడీపీ.. ప్రజల్లో మరింత చులకన అవకుండా దృష్టి మళ్లించడానికే ఏబీఎన్ రాధాకృష్ణ, చంద్రబాబు డైవర్షన్ రాజకీయం చేస్తున్నారని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. ఇందులో భాగంగానే రెండో విడత పంచాయతీ ఎన్నికల ఫలితాలు వెలువడి ఒక్క రోజు అయినా గడవకముందే అన్నా చెల్లెళ్ల మధ్య విభేదాలు అంటూ అడ్డగోలు రాతలు రాస్తున్నారని సజ్జల మండిపడ్డారు. ఎన్నికల ఫలితాలపై చర్చను పక్కదారి పట్టించడమే వారి లక్ష్యమని, ఈ కుటిల వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నామని సజ్జల అంటున్నారు.
సీఎం జగన్, షర్మిల.. ఒకరిపై ఒకరికి అపరిమితమైన ప్రేమ ఉందని సజ్జల తెలిపారు. మహానేత వైఎస్సార్ కుటుంబం చాలా పెద్దదని, ఆ కుటుంబంలో అందరూ విశాలమైన భావాలు కలవారని సజ్జల వివరించారు. ఇప్పటికైనా రాధాకృష్ణ చౌకబారు ఆలోచనలు మానుకోవాలని సూచించారు. ఇలాంటి రాతలు, కథనాల ద్వారా ప్రతిపక్ష నేత చంద్రబాబుకు మేలు చేద్దామని, సీఎం జగన్ ఇమేజ్ను తగ్గిద్దామని రాధాకృష్ణ భావిస్తే, అది అవివేకమే అవుతుందని స్పష్టం చేశారు. ఈ రాతల ద్వారా రాధాకృష్ణ నీచమైన, కుచ్చితమైన బుద్ధి బయట పడుతోందన్నారు. ఏబీఎన్ రాధాకృష్ణ రాతలపై, కథనాలపై లీగల్గా ముందుకు వెళ్తామని సజ్జల అంటున్నారు.