మళ్లీ అంటుకుంటున్న ఉస్మానియా వర్శిటీ..ఇక కేసీఆర్‌కు ఇబ్బందులేనా..?

Chakravarthi Kalyan
ఉస్మానియా వర్శిటీ.. తెలంగాణ ఉద్యమ సమయంలో కీలకపాత్ర పోషించింది. ఉద్యమానికి కేరాఫ్ అడ్రస్ అయ్యింది. కొలిమిలా అంటుకున్నది.. కేసీఆర్ దీక్షను విరమించే సమయంలో మరోసారి గుడ్లు ఉరిమి చూసి.. దారి తప్పుతున్న ఉద్యమాన్ని గాడిన పెట్టింది. అలాంటి ఉస్మానియా యూనివర్శిటీ మరోసారి అంటుకుంటున్నది. తెలంగాణ వచ్చి ఏడేండ్లు అవుతున్నా.. ఆశించిన స్థాయిలో ఉద్యోగాలు రాలేదన్న మాట వాస్తవం. ఇప్పుడు ఇదే అంశంపై నేడు ఉస్మానియా ఆర్ట్ కళాశాల వేదికగా ఓ సెమినార్ నిర్వహిస్తున్నారు వర్శిటీ రీసెర్చ్ స్కాలర్లు.



ఇదే సమయంలో తెలంగాణ స్టూడెంట్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో మరికొందరు ఉద్యోగం, ఉపాధి, బతుకుదెరువు సాధన యాత్ర ప్రారంభిస్తున్నారు. రాష్ట్రంలో 2 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని.. అయినా కేసీఆర్ ప్రభుత్వం 50 వేల ఉద్యోగాలు వేస్తామని నిరుద్యోగులను మోసం చేయడం కోసం మరో కుట్రలకు తెరలేపిందని వీరు అంటున్నారు. కేవలం పట్టభద్రుల  ఓట్ల కోసమే ఈ ప్రకటనలు చేస్తున్నారని.. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే రాష్ట్రంలో ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేశారు అనే దానిపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు.




రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలని, వెంటనే నిరుద్యోగ భృతి చెల్లించాలని, జాబ్ క్యాలెండర్ ప్రకటించాలనే డిమాండ్లతో... యువతకు ఉద్యోగం, ఉపాధి, బతుకుదెరువు కల్పించాలని, తెలంగాణ అస్తిత్వాన్ని బ్రతికించాలని తెలంగాణ స్టూడెంట్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఉమ్మడి వరంగల్, ఉమ్మడి నల్గొండ, ఉమ్మడి ఖమ్మం జిల్లాల వ్యాప్తంగా ఉన్న అన్ని నియోజకవర్గాల కేంద్రాల మీదుగా యాత్ర కొనసాగుతుంది. ఇవాళ ఉదయం 11 గంటలకు అసెంబ్లీ ఎదురుగా గన్ పార్క్ లో అమరవీరులకు నివాళి సమర్పించి యాత్ర ప్రారంభిస్తారు. ఈ యాత్రను టీజేఎస్‌ ఉపాధ్యక్షులు పి.ఎల్. విశ్వేశ్వరరావు జెండా ఊపి ప్రారంభిస్తారు. ఇలా మొత్తం మీద తెలంగాణలో రెండు ఘటనలు ఒకే రోజు ప్రారంభం అవుతున్నాయి. ఇది కేసీఆర్‌ కు ఓ హెచ్చరిక వంటిది అంటున్నారు విద్యావేత్తలు. ఇకనైనా ఉద్యోగాల భర్తీ వేగవంతం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: