నిమ్మగడ్డ చేతిలో జగన్‌కు మరోసారి షాక్ తప్పదా..?

Chakravarthi Kalyan
ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌కూ ఏపీ సర్కారుకూ జగడం కొనసాగుతూనే ఉంది. ఎన్నికల నోటిఫికేషన్ విడుదల రోజే నిమ్మగడ్డ పంచాయతీల ఏకగ్రీవానికి తాను వ్యతిరేకమని చెప్పేశారు. అంతే కాదు.. ఏకగ్రీవాలు కాకుండా ఉండేందుకు ప్రత్యేకంగా దృష్టి పెడతానన్నారు. అయితే నిమ్మగడ్డ ఎడ్డెం అంటే.. తెడ్డెం అనే జగన్ సర్కారు ఊరుకుంటుందా.. అందుకే ఏకగ్రీవ పంచాయతీలకు ప్రోత్సాహకాలు పెంచేసింది.
రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలకు ఏర్పాట్లు జరుగుతున్న నేపథ్యంలో ఏకగ్రీవ పంచాయతీలకు ఇచ్చే ప్రోత్సాహకాలను ఏపీ ప్రభుత్వం పెంచింది. జనాభా ప్రాతిపదికన రూ.20లక్షల వరకు ప్రోత్సాహకంగా అందివ్వనున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 2వేల లోపు జనాభా ఉన్న పంచాయతీలకు రూ.5లక్షలు, 2వేల నుంచి 5వేలు ఉంటే రూ.10లక్షలు, 5వేల నుంచి 10వేల జనాభాకు రూ.15లక్షలు, 10వేల జనాభా దాటితే రూ.20లక్షల ప్రోత్సాహకం అందించనున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.
మరి జగన్ సర్కారు తీసుకున్న ఈ నిర్ణయంపై ఎస్‌ఈసీ నిమ్మగడ్డ ఏం చేస్తారో చూడాలి. ఒకసారి ఎన్నికల నోటిఫికేషన్ వచ్చాక.. ఎస్‌ఈసీయే రాష్ట్రానికి సుప్రీంగా ఉంటారు.. అంటే ఎన్నికల అంశాలకు సంబంధించినంత వరకూ.. మరి జగన్ సర్కారు తీసుకున్న నిర్ణయంపై నిమ్మగడ్డ ఎలా స్పందిస్తారో చూడాలి. అసలే నిమ్మగడ్డ మంచి కసిమీద ఉన్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్ మళ్లీ బ్యాటింగ్ ప్రారంభించారు.
ఆయన మరోసారి వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేశారు. రేపు ఉదయం 11 గంటలకు  ఎస్ ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేశారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌కు అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు హాజరుకావాల్సిందే. అంతే కాదు.. ఈ  వీడియో కాన్ఫరెన్స్ లో సీఎస్ ఆదిత్యనాథ్ దాస్, డీజీపీ గౌతమ్ సవాంగ్ కూడా పాల్గొంటారు. ఈ మీటింగ్‌లో పంచాయతీ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లపై ఉన్నతాధికారులతో ఎస్ ఈసీ చర్చిస్తారు.  పంచాయతీల్లో నామినేషన్లకు ఏర్పాట్లు, ఓటర్ల జాబితా రూపకల్పన తదితర అంశాలపై చర్చిస్తారు. పంచాయతీల్లో భద్రతా పరమైన అంశాలపై  సమావేశంలో చర్చిస్తారు. ఎన్నికలు సజావుగా జరిగేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఆదేశాలిస్తారు. ఎన్నికలకు సంబంధించి పలు అంశాలపై  కలెక్టర్లు, ఎస్పీలకు నిమ్మగడ్డ ఆదేశాలు జారీ చేస్తారు.  
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: