పాత వంద నోట్లు ఇకమీదట కనిపించవు అనే వార్త గత కొద్ది రోజులుగా చక్కర్లు కొడుతుంది. వంద నోట్లతో పాటుగా . 10, రూ. 5 నోట్లను భారతీయ రిజర్వు బ్యాంకు వెనక్కి తీసుకోబోతోందన్న వార్తలు కూడా వినిపించాయి.మార్చి, ఏప్రిల్ నాటికి చెలామణి నుంచి వీటిని పూర్తిగా తప్పించాలని ఆర్‌బీఐ నిర్ణయించినట్టు ఇటు ప్రధాన మీడియాలోను, అటు సోషల్ మీడియాలోనూ వార్తలు షికారు చేస్తున్నాయి. దీంతో ప్రజలు మరోమారు ఆందోళనకు గురవుతున్నారు. ఇప్పటి నుంచే ఆయా నోట్లను తీసుకునేందుకు వెనకడుగు వేస్తున్నారు.
ప్రజలను ఇంతగా భయపెడుతున్న వార్త ఎలా పుట్టిందో కానీ, ఆర్‌బీఐ నుంచి మాత్రం ఇప్పటి వరకు ఈ విషయంలో అధికారికంగా ఎటువంటి ప్రకటన వెలువడలేదు. ఈ విషయం పై పలు మీడియా సంస్థలు కూడా ఇష్టమొచ్చినట్లు కథనాలు పేర్కొంటున్నారు. ఇప్పటికే పాత నోట్ల స్థానంలో రూ. 100, రూ. 10, రూ. 5 నోట్ల స్థానం లో కొత్త నోట్లు రావడం గమనార్హం. మరోవైపు, 10 రూపాయల నాణేన్ని తీసుకొచ్చి 15 ఏళ్లు అయింది. ఈ నాణేన్ని రద్దు చేసినట్టు గతంలో వార్తలు వచ్చాయి. దీంతో వ్యాపారులు ఈ నాణేన్ని తీసుకునేందుకు ఇప్పటికీ అంగీకరించడం లేదు. ఈ విషయంలో రిజర్వు బ్యాంకు పలుమార్లు వివరణ ఇచ్చింది.
పది, ఐదు రూపాయల నాణేన్ని తీసుకోకుంటే చర్యలు తీసుకోవాల్సి వస్తుందని కూడా హెచ్చరించింది. మీరు ఎన్ని చెప్పినా మేము వినము అంటూ కొందరు వ్యవహరిస్తున్నారు. ఇప్పటికీ పది నాణేన్ని తీసుకునేందుకు ఎవరూ అంగీకరించడం లేదు. రిజర్వు బ్యాంకుకు ఇప్పుడిదో పెద్ద తలనొప్పి వ్యవహారంగా మారింది. ఇప్పుడు పాత నోట్లను చెలామణి నుంచి తొలగిస్తున్నట్టు వస్తున్న వార్తలు ప్రజలను మరింత ఇరకాటంలో పడేశాయి. ఆర్‌బీఐకి ఇప్పుడు ఇది మరో కొత్త తలనొప్పిగా మారింది.ఈ విషయం పై ఆర్బీఐ ఎలాంటి ప్రకటన ఇస్తుందో చూడాలి..