రాజకీయాల్లోకి V6 జర్నలిస్ట్ సంగప్ప.. ఏ పార్టీ ?.. సక్సస్ అవుతారా..?

Chakravarthi Kalyan
రాజకీయాల్లోకి అనేక రంగాల వారు వస్తుంటారు. కానీ.. ఇప్పట్లో రాజకీయాల్లో నెగ్గుకురావాలంటే.. కండబలం, ధనబలం కావాలి.. అవి లేకుండా రాణించే రోజులు కావివి. కానీ.. కొందరు ఇందుకు మినహాయింపు.. అలా తాను కూడా మినహాయింపు కావాలని మరో జర్నలిస్టు రాజకీయాల్లోకి అడుగు పెడుతున్నారు. ఆయనే వీ6 ఛానల్ ఇన్‌పుట్ ఎడిటర్ సంగప్ప.. ఆయన రాజకీయాల్లోకి అడుగు పెడుతున్నారు.
ఇంతకీ ఏ పార్టీ అంటారా.. ఆయన ఇన్నాళ్లూ పని చేసిన ఛానల్ యజమాని వివేక్ ఏ పార్టీలో ఉన్నారో.. అదే పార్టీ నుంచి సంగప్ప రాజకీయాల్లో అడుగు పెడుతున్నారు. అదేనండీ బీజేపీ నుంచి.. నారాయణఖేడ్ ప్రాంతానికి చెందిన సంగప్ప.. ఈటీవీ ద్వారా జర్నలిజంలోకి అడుగుపెట్టారు. ఈటీవీలో కొద్దికాలం పని చేసిన ఆయన ఆ తర్వాత ఐ న్యూస్‌లో చేరారు.. అక్కడి నుంచి వీ6 ఛానల్‌లో చేరారు. అక్కడ సుదీర్ఘకాలం పని చేశారు. ఇన్‌పుట్ ఎడిటర్ స్థాయికి సంగప్ప చేరారు.  దాదాపు రెండు దశాబ్దాల జర్నలిస్టుగా పని చేసిన సంగప్ప.. వీ6 ఛానల్‌లో డిస్కషన్ల ద్వారా ప్రజలకు బాగా పరిచితులు.
టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ రాజకీయ నేతలతో 15 ఏళ్లుగా సన్నిహిత సంబంధాలు కలిగిన సంగప్ప.. కొత్త సంవత్సరంలో కొత్త రంగంలో అడుగుపెడుతున్నారు. జర్నలిజానికి ఫుల్ స్టాప్ పెట్టేసి... ప్రత్యక్ష రాజకీయాల్లోకి దూకుతున్నారు. బీజేపీలో ఆయన చేరుతున్నారు. తెలంగాణలో ఇప్పుడు కాస్త బీజేపీకి అనుకూల పవనాలు వీస్తున్న సంగతి తెలిసిందే. అందుకే వచ్చే అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా సంగప్ప రాజకీయాల్లోకి అడుగు పెడుతున్నారు.
సంగప్పలాంటి విద్యావంతులు, ఆలోచనాపరులు, తెలంగాణ సమాజంపై, సమస్యలపై అవగాహన ఉన్నవారు రాజకీయాల్లోకి రావడాన్ని స్వాగతించాల్సిందే. గతంలో కె. నాగేశ్వర్, క్రాంతి వంటి వారు.. ఏపీలో మంత్రి కన్నబాబు, మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు తది తరులు జర్నలిజం బ్యాక్‌ గ్రౌండ్ నుంచి రాజకీయాలలోకి  వచ్చినవారే. సంగప్ప రాజకీయాల్లో రాణించాలని పాత్రికేయులు ఆకాంక్షిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: