అచ్చెన్న, నిమ్మలకు అదిరిపోయే షాక్ తగలనుందా?

M N Amaleswara rao
ప్రతిపక్ష టీడీపీలో అధికార వైసీపీ మీద దూకుడుగా వెళ్ళే ఎమ్మెల్యేలు ఎవరైనా ఉన్నారంటే అది అచ్చెన్నాయుడు, నిమ్మల రామానాయుడులే అని చెప్పొచ్చు. టీడీపీలో కీలకంగా ఉన్న ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు ప్రతి సందర్భంలోనూ వైసీపీని ఇరుకున పెట్టడానికే చూశారు. అదే సమయంలో ఈ ఇద్దరినీ వైసీపీ కూడా ఇరుకున పెట్టింది. ముఖ్యంగా అసెంబ్లీ సమావేశాల్లో టీడీపీ బలం తక్కువగా ఉన్నా సరే ఈ ఇద్దరు నేతలు మాత్రం అధినేత చంద్రబాబుకు మంచి సపోర్ట్ ఇస్తూ వచ్చారు.
అలాగే వైసీపీపై విమర్శలు చేయడంలో ముందున్నారు. అందుకే వైసీపీ ఈ ఇద్దరినే గట్టిగా టార్గెట్ చేసినట్లు కనిపించింది. ఎక్కువ సందర్భాల్లో ఈ ఇద్దరినే అసెంబ్లీ నుంచి సస్పెండ్ కూడా చేసింది. ఇక వీరి టార్గెట్‌గానే ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో వైసీపీ సభా హక్కుల నోటీసులు ఇచ్చింది. ఈ క్రమంలోనే సభా హక్కుల నోటీసుపై కాకాని గోవర్ధన్ రెడ్డి నేతృత్వంలో అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ భేటీ అయ్యింది.
టీడీపీ ఎమ్మెల్యేలు అచ్చెన్న, నిమ్మలపై వైసీపీ ఇచ్చిన సభా హక్కుల ఉల్లంఘన నోటీసులపై చర్చ జరిగింది. టీడీపీ ఎమ్మెల్యేలు అచ్చెన్నాయుడు, నిమ్మల రామానాయుడుకు వారం రోజుల్లో నోటీసులు ఇవ్వాలని కమిటీ నిర్ణయించింది. ప్రొసీజర్ ప్రకారమే ఆ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలకు నోటీసులు ఇవ్వాలని కమిటీ చెబుతోంది. అయితే కమిటీ సమావేశం ఏకపక్షంగా జరిగిందని టీడీపీ ఆరోపిస్తుంది. సీఎంపై ఐదు, మంత్రి కన్నబాబుపై ఒకటి, చీఫ్ మార్షల్ థియోఫిలస్‌పై తామిచ్చిన ప్రివిలేజ్ నోటీసులపై చర్చించాలని టీడీపీ పట్టుబడుతుంది.
టీడీపీ ఇచ్చిన నోటీసులను కమిటీ పట్టించుకోలేదని ఆరోపిస్తున్నారు. అయితే ఇక్కడ ఎమ్మెల్యే అచ్చెన్న, నిమ్మలకు నోటీసులు ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. ఆ నోటీసులకు ఎమ్మెల్యేలు ఇచ్చిన సమాధానాలు సంతృప్తిగా ఉంటే సరే లేదంటే, ఇద్దరిపై వైసీపీ ప్రభుత్వం చర్యలు తీసుకునే అవకాశం లేకపోలేదు. మొత్తానికైతే అచ్చెన్న, నిమ్మలకు వైసీపీ అదిరిపోయే షాక్ ఇచ్చేలా కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: