గ్రేటర్ యుద్ధం: మోదీని టార్గెట్ చేసిన కేసీఆర్..

Deekshitha Reddy
గ్రేటర్ ప్రచారంలో భాగంగా.. ఇటీవల జాతీయ ఎన్నికల్లో టీఆర్ఎస్ పాత్రపై చూచాయగా మాట్లాడారు కేసీఆర్. అవసరమైతే తాను జాతికోసం త్యాగం చేస్తానని, అన్ని పార్టీలను కలుపుకొని బీజేపీని గద్దె దింపుతామంటూ సవాల్ విసిరారు. అదే కేసీఆర్.. ఈనెల 28న ఎల్బీ స్టేడియంలో జరిగే బహిరంగ సభలో మోదీని టార్గెట్ చేస్తూ మరింత ఘాటుగా మాట్లాడబోతున్నట్టు తెలుస్తోంది. గ్రేటర్ ప్రచారానికి ముగింపుగా ఈనెల 28న టీఆర్ఎస్ భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసింది. తెలంగాణ సీఎం కేసీఆర్ కీలకోపన్యాసం ఈ సభకు ప్రధాన ఆకర్షణ కానుంది.
జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారంలో అధికార, విపక్ష పార్టీల ఆరోపణలు, ప్రత్యారోప ణలు, దూషణలు, రెచ్చగొట్టే ప్రసంగాలతో ఇప్పటికే భాగ్య నగర వాతావరణం బాగా వేడెక్కింది. ఇక ఈ నెల 28న ఆ వాతావరణం మరింతగా వేడెక్కడం ఖాయమని అంచనా వేస్తున్నారు తెలంగాణ ప్రజలు. జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈనెల 28, శనివారం సాయంత్రం 4 గంటలకు ఎల్బీ స్టేడియంలో సీఎం కేసీఆర్‌ బహిరంగ సభ నిర్వహిస్తారని కేటీఆర్ ప్రకటించారు. అయితే ఈనెల 28న ప్రధాని నరేంద్రమోదీ హైదరాబాద్‌ అధికారిక పర్యటన కూడా ఖరారైంది. దీంతో ఆరోజు గ్రేటర్‌ ఎన్నికల రాజకీయం రసవత్తరంగా మారుతుందని అంటున్నారు.
ప్రధాని మోదీ ఈనెల 28 మధ్యాహ్నం హైదరాబాద్‌ పర్యటనకు వస్తున్నారని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం అందింది. కోవిడ్‌–19 వైరస్ ని అరికట్టేందుకు భారత్‌ బయోటెక్‌ ఫార్మా కంపెనీ తయారుచేస్తున్న ‘కొవాగ్జిన్‌’ పురోగతిని స్వయంగా పరిశీలించేందుకు ప్రధాని ఈ పర్యటనకు శ్రీకారం చుట్టారని అంటున్నారు. అయితే గ్రేటర్ ఎన్నికల ప్రచారం సందర్భంగా ప్రధాని హైదరాబాద్ కి రావడం ఆసక్తిగా మారింది. ఈనెల 28 మధ్యాహ్నం ఢిల్లీ నుంచి నేరుగా మోదీ హకీంపేట సైనిక విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుంచి శామీర్ ‌పేట వద్ద ఉన్న భారత్‌ బయోటెక్‌ ల్యాబ్ సందర్శిస్తారు. వ్యాక్సిన్‌ రూపకల్పనకు కృషిచేస్తున్న శాస్త్రవేత్తల బృందంతో మాట్లాడి వివరాలను అడిగి తెలుసుకుంటారు. ఆ తర్వాత పుణె పర్యటనకు వెళ్తారని అధికారవర్గాలు తెలిపాయి. అయితే అదే రోజు ప్రధాని హైదరాబాద్ లో ఉండగానే కేసీఆర్ జాతీయ రాజకీయాలపై కీలక ప్రకటన చేస్తారని టీఆర్ఎస్ శ్రేణులు అంటున్నాయి. అదే జరిగితే గ్రేటర్ ఎన్నికల సాక్షిగా.. కేసీఆర్ ప్రధానిని టార్గెట్ చేసినట్టవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: