ఏపీ వాసులకు శుభవార్త.. అతి త్వరలో టిడ్కో ఇళ్ల కేటాయింపు..

Deekshitha Reddy
టీడీపీ హయాంలో నిర్మించిన టిడ్కో ఇళ్ల కేటాయింపు ఓ కొలిక్కి వస్తోంది. త్వరలోనే లబ్ధిదారులకు ఇళ్లు కేటాయించడానికి ప్రభుత్వం సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. దీనికి మహూర్తం కూడా ఖరారైపోయినట్టు, ఇక ప్రకటన తరువాయి అని చెబుతున్నారు వైసీపీ నేతలు. రివర్స్ టెండరింగ్ విధానం వల్ల ఇన్ని రోజులూ టిడ్కో ఇళ్ల కేటాయింపు ఆలస్యం అయిందని అంటున్నారు మంత్రి బొత్స సత్యనారాయణ.
టీడీపీ ప్రభుత్వం చదరపు అడుగుకి రూ.500 అదనంగా చెల్లించేందుకు ఒప్పందం కుదుర్చుకుందని, తద్వారా వేలా కోట్ల ప్రజాధనం దోపిడీకి పథక రచన చేసిందని ఆరోపించారు బొత్స. ఆ భారం లబ్ధిదారులపై పడకూడదన్న ఉద్దేశంతో వైసీపీ ప్రభుత్వం రివర్స్‌ టెండరింగ్‌ విధానాన్ని అవలంబించి, ప్రజాధనాన్ని కాపాడినట్టు ఆయన తెలిపారు. ఈ రివర్స్‌ టెండరింగ్‌ కారణంగానే లబ్ధిదారులకు ఇళ్ల అప్పగింత ఆలస్యమైందని వివరణ ఇచ్చారు. వాస్తవానికి శంకుస్థాపన జరిగిన ఆరు నెలల్లో ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి లబ్ధిదారులకు ఇవ్వాల్సి ఉండగా.. గత టీడీపీ ప్రభుత్వం ఐదేళ్లలో ఎందుకు ఇవ్వలేకపోయిందని ప్రశ్నించారు బొత్స. త్వరలోనే టిడ్కో ఇళ్లను ప్రజలు కేటాయిస్తామని చెప్పారు.
టిడ్కో ఇళ్ల వ్యవహారంలో వైసీపీ ప్రభుత్వం కక్షసాధిస్తోందంటూ కొన్నిరోజులుగా టీడీపీ ఆందోళనలు చేపట్టింది. వామపక్షాలతో కలసి అపార్ట్ మెంట్ల వద్ద నిరసన కార్యక్రమాలు చేపట్టింది. దీంతో టిడ్కో అపార్ట్ మెంట్ల వద్ద భద్రత కట్టుదిట్టం చేశారు. అదే సమయంలో ప్రభుత్వం కూడా ఇకపై ఈ వివాదాన్ని నాన్చకుండా ఫుల్ స్టాప్ పెట్టేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టింది. త్వరలోనే లబ్ధిదారులందరికీ టిడ్కో ఇళ్లు కేటాయిస్తామని చెబుతోంది. 300 చదరపు అడుగుల అపార్ట్ మెంట్లను పూర్తి ఉచితంగా అప్పగించబోతున్నారు. ఆ తర్వాత ఎక్కువ విస్తీర్ణం ఉన్న ఇళ్ల విషయంలో మాత్రం లబ్ధిదారులు బ్యాంక్ లోన్ కట్టాల్సిందే. దీంతో అటు ప్రతిపక్షాలు దీన్ని తమ విజయంగా చెప్పుకుంటున్నాయి. ప్రతిపక్షాల ఒత్తిడి వల్లే ప్రభుత్వం దిగొచ్చి, ఇళ్ల కేటాయింపుకి సిద్ధపడిందని అంటున్నారు నేతలు. 300 చదరపు అడుగులకంటే ఎక్కువ విస్తీర్ణం ఉన్న అపార్ట్ మెంట్లను కూడా లబ్ధిదారులకు ఉచితంగానే ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: