చంద్రబాబులో కొత్త ఆశలు నింపిన ఆ రిపోర్ట్ లో అసలు ఏముంది..?

Chakravarthi Kalyan
ఆశ.. మనిషిని నడిపించే శ్వాస ఇదే.. ఆశ లేకుండా జీవితం నిస్సారం.. ఒక్కొకరికి ఒక్కో ఆశ.. మరి రాజకీయ నాయకుల సంగతి చెప్పాల్సిన పనే లేదు.. వాళ్లకు ఉన్న ఆశ శ్వాస ఒక్కటే అదే పదవి.. ఏళ్ల తరబడి అధికారం అనుభవించినా సరే.. పదవీ వ్యామోహం అంత సులభంగా తొలగిపోదు. ఇందుకు తాజా ఉదాహరణగా చంద్రబాబు ను చెప్పుకోవచ్చు. ఎందుకంటే.. ఆయన ఇప్పుడు ఆశల పల్లకీలో ఊరేగుతున్నారు. ఎప్పుడెప్పుడు మళ్లీ ఏపీ సీఎం సీట్లో కూర్చుందామా అని కలలు కంటున్నారు.
అదేంటి.. ఇంకా జగన్ కు మూడున్నరేళ్లు పదవీ కాలం ఉంది కదా.. అప్పుడే చంద్రబాబుకు అవకాశం ఎలా వస్తుంది..అందులోనూ జగన్ ను ఈసారి జనం తిరస్కరిస్తారన్న గ్యారంటీ ఏముంది.. ఏమో మళ్లీ జగనే సీఎం కావచ్చేమో కదా అంటారా.. అబ్బే ఆ ఛాన్స్ అస్సలు లేదు.. జగన్ పూర్తి కాలం సీఎంగా ఉండే ఛాన్సే లేదు.. ఎందుకంటే.. జగన్ త్వరలోనే జైలుకు వెళ్లిపోతున్నాడని చంద్రబాబు టీమ్ గట్టిగా నమ్ముతోంది. మరి ఆ నమ్మకానికి కారణం ఏంటి అంటారా.. అది ఓ రిపోర్ట్ మహత్యం.
ఇంతకీ ఆ రిపోర్ట్ ఏంటంటే.. ఢిల్లీలోని అసోసియేషన్‌ ఫర్‌ డెమోక్రటిక్‌ రిఫార్మ్స్‌ ఏడీఆర్‌ అనే స్వచ్ఛంద సంస్థ ఇటీవల ఓ రిపోర్ట్ ఇచ్చింది. దాని సారాంశం ఏంటంటే.. సీబీఐ, ఈడీ వంటి కేసులలో ఉన్న వారికి 10 నుంచి 30 ఏళ్ల వరకు జైలు శిక్షపడే అవకాశం ఉందట. మరి జగన్ కూడా ఈ రెండు కేసుల్లో ఉన్నాడు కదా.. అందులోనూ ఇటీవల రాజకీయ నాయకుల కేసులు త్వరగా తేల్చేయాలని సుప్రీం కోర్టు చెప్పింది కదా.. అందువల్ల జగన్ జైలుకు పోవడం ఖాయం అన్న నమ్మకం చంద్రబాబు అండ్ కో ది.
మరి జగన్ జైలుకు వెళ్తే ఇంకేముంది.. వైకాపా ముక్కలు చెక్కలవుతుంది.. అప్పుడు మళ్లీ తానే చక్రం తిప్పుతాడు.. ఇదీ చంద్రబాబు ఆశ మరియు శ్వాస. మరి చంద్రబాబు ఆశలు నెరవేరతాయా.. అంటే పిల్లి శాపాలకు ఉట్లు తెగుతాయా అని సమాధానం ఇస్తున్నారు వైసీపీ నేతలు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: