జగన్‌తో దోస్తీ కోసం బీజేపీ తహతహ.. ఎందుకంటే..?

Chakravarthi Kalyan
త్వరలోనే వైసీపీ కేంద్రమంత్రి వర్గంలో చేరడం ఖాయం అన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఈ మేరకు మోడీ లైన్ క్లియర్ చేశారని.. కానీ వైసీపీయే కాస్త ముందు వెనుక ఆలోచించుకుంటూ ఆలస్యం చేస్తోందన్న వాదనలు వినిపిస్తున్నాయి. అయితే వైసీపీ ఎన్డీఏలో చేరినా చేరకపోయినా.. కొత్త పార్టీలతో పొత్తు కోసం బీజేపీ మాత్రం తహతహలాడుతోందనే చెప్పాలి. అయితే ఇప్పటికే ఫుల్ మెజారిటీలో ఉన్న బీజేపీ కొత్త స్నేహాల కోసం ఎందుకు తాపత్రయపడుతోంది..?
ఇందుకు కారణాలు లేకపోలేదు.. ప్రస్తుతం అధికారంలో ఉన్నది ఎన్డీఏ.. అయితే ఇది పేరుకే కూటమి.. ప్రస్తుతం కేంద్ర కేబినెట్‌లో బీజేపీ కి సంబంధించిన వారు తప్ప వేరే ఏ పార్టీ వారు కూడా మంత్రిగా లేరు. ఎన్టీఏ కూటమి మొదట్లో 24 పార్టీలతో ప్రారంభమైనా.. చివరకు ఒక్కొక్కకటిగా అనేక పార్టీలు బీజేపీకి కటీఫ్ చెప్పేశాయి. అదే సమయంలో కేంద్రంలో మంత్రి పదవులు కూడా వదులుకున్నాయి.
బీజేపీ నుంచి మొదట విడిపోయింది శివసేన. మహారాష్ట్రలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, బీజేపీ, శివసేన మధ్య పొరపొచ్చాలొచ్చాయి. దీంతో అనంత గీతే కేంద్ర మంత్రి వర్గానికి గుడ్ బై చెప్పేశారు. ఈయన భారీ పరిశ్రమల మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. ఆ తర్వాత కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తూ అకాలీదళ్ గుడ్ బై చెప్పేసింది. గత నెలలోనే  కేంద్ర మంత్రి వర్గం నుంచి హర్‌సిమ్రత్ కౌర్ వైదొలిగారు.
ఇక ఎన్డీఏలో కేంద్రమంత్రిగా ఉన్న ఒకే ఒక్క బీజేపీయేతర మంత్రి, ఎల్జేపీ అధినేత రామ్ విలాస్ పాశ్వాన్  అనారోగ్యంతో కన్నుమూశారు. దీంతో ఇక ఇప్పుడు కేంద్ర మంత్రులుగా ఉన్నవారంతా బీజేపీకి చెందినవారే. అందుకే ఇప్పుడు ఎన్డీఏలోకి కనీసం వైసీపీ వంటి బలమైన పార్టీని తెచ్చుకుని మంత్రి పదవులు ఇవ్వడం ద్వారా కూటమి అన్న పేరు నిలబెట్టుకునేందుకు బీజేపీ తహతహలాడుతోంది.  అందుకోసమే జగన్ ను ప్రసన్నం చేసుకునేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: