బాలు విషయంలో ముందుగానే కర్చీఫ్ వేసేసిన బాబు..?

Chakravarthi Kalyan
ప్రతిపక్షంలో ఉన్నవాళ్లు ప్రభుత్వాలని అనేక విషయాల్లో డిమాండ్ చేస్తుంటారు... ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తుంటారు. ఒక్కోసారి ప్రభుత్వం వీరి ఒత్తిడికి తలొగ్గుతుంది. వారి డిమాండ్లు నెరవేరుస్తుంది.. అప్పుడు ప్రతిపక్షాలు ఏమంటాయి.. మేం ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి ప్రభుత్వం మెడలు వంచి ఇది సాధించాం అని ఘనంగా చెప్పుకుంటాయి. ఇలాంటివి చాలా జరుగుతాయి. అదే ప్రజాస్వామ్యంలోని గొప్పదనం.
అయితే ఇక్కడ మరో రకం కూడా ఉంటుంది. అదేంటంటే.. ప్రభుత్వం ఏం చేయబోతోందో గ్రహించి.. దాన్నే డిమాండ్ చేయడం.. అప్పుడు ప్రభుత్వం ఆ పని చేశాక.. అదిగో మేం ముందే చెప్పాం.. మేం చెప్పడం వల్లే ప్రభుత్వం ఆ పని చేసింది అని చెప్పుకోవడం... ఇప్పుడు ఏపీలో చంద్రబాబు అదే చేస్తున్నారేమో అనిపిస్తోంది. ఎస్పి బాల సుబ్రమణ్యం స్మృత్యర్ధం నెల్లూరులో సంగీత విశ్వవిద్యాలయం నెలకొల్పాలని కోరుతూ తెలుగుదేశం అధినేత చంద్రబాబు సీఎం జగన్ కు లేఖ రాశారు.
ఎస్పీ బాలు కాంస్య విగ్రహం ఏర్పాటు, కళాక్షేత్రం అభివృద్ది, ప్రతి ఏటా రాష్ట్ర పండుగగా జయంతి, జాతీయ పురస్కారం ఏర్పాటు, లలిత కళలకు ప్రోత్సాహం వంటి అంశాలను చంద్రబాబు లేఖలో ప్రస్తావించారు. సంగీత విశ్వవిద్యాలయంలో బాల సుబ్రమణ్యం కాంస్య విగ్రహం ఏర్పాటుతో పాటు ఆ ప్రాంతాన్ని బాల సుబ్రమణ్యం సంగీత కళాక్షేత్రంగా అభివృద్ది చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ సంగీత అకాడమీకి ఆయన పేరుపెట్టడం ద్వారా సంగీతం, ఇతర లలిత కళల్లో యువతరాన్ని ప్రోత్సహించడం ద్వారా బాల సుబ్రమణ్యం కల నెరవేర్చాలని కోరారు.
ఈ ప్రభుత్వం బాలు కోసం ఏదో ఒకటి చేస్తుంది.. కాబట్టి ఏం చేసేందుకు అవకాశం ఉందో.. అవన్నీ ప్రస్తావిస్తూ చంద్రబాబు ఓ లేఖ రాసేశారు. రేపు జగన్ సర్కారు వీటిలో ఏ ఒక్కటి చేసినా ఆ క్రెడిట్ చంద్రబాబుకే దక్కేలా ముందుగానే ప్లాన్ చేశారు చంద్రబాబు. దాన్నే చాణక్యనీతి అంటారు. చంద్రబాబా.. మజాకా.. మరి.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: