లోకేశ్ కోసం శ్రీకాళహస్తిలోనూ క్షుద్ర పూజలా..?

Chakravarthi Kalyan
ఇప్పుడు ఏపీలో మత వివాదాలు బాగా చర్చనీయాంశం అవుతున్నాయి. అంతర్వేది రథం దగ్దంతో మొదలైన ఈ వివాదాలు జగన్ డిక్లరేషన్‌తో పాటు అనేక అంశాలను తెరపైకి తీసుకొచ్చాయి. ఈ నేపథ్యంలో అధికార, విపక్షాల మధ్య వాదోపవాదాలు జోరుగా సాగుతున్నాయి. మీ హయాంలో అలా అయ్యింది.. అంటూ వైసీపీ నేతలు కూడా బాగానే చంద్రబాబు కాలంనాటి అపచారాలను గుర్తు చేస్తున్నారు. అందులో భాగంగానే మొన్న దుర్గ గుడి ఈవో స్వామినాయుడు ఓ సంచలన అంశం బయటపెట్టారు.

నారా లోకేశ్ ను సీఎంను చేసేందుకు అమ్మవారి అనుగ్రహం కోసం విజయవాడ కనక దుర్గ అమ్మవారి ఆలయంలో క్షుద్ర పూజలు నిర్వహించారు అనేది ఆ సంచలన ఆరోపణ. అయితే ఈ ఆరోపణలో నిజం ఎంత ఉందో తెలియదు కానీ.. దుర్గ గుడిలో అర్ధరాత్రి వేళ క్షుద్ర పూజలు జరిగాయన్న సంగతిని మాత్రం ఆనాటి పూజారులు కూడా అంగీకరించారని చెబుతారు. అయితే అది ఎవరి కోసం జరిగిందన్నది ఆ తర్వాత కనుమరుగైపోయింది.
ఇప్పుడు ఈ మత వివాదాల నేపథ్యంలో ఇప్పుడు పాత సంగతులన్నీ బయటకు వస్తున్నాయి. తాజాగా.. వైసీపీ నాయకురాలు, తెలుగు అకాడమీ చైర్ పర్సన్ అయిన లక్ష్మీ పార్వతి  కూడా రంగంలోకి దిగారు. లోకేశ్ కోసం బెజవాడలోనే కాదు శ్రీకాళ హస్తిలోనూ అప్పట్లో భువనేశ్వరి క్షుద్రపూజలు చేయించారని సంచలన ఆరోపణ చేశారు.  దేవాలయాల గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదని నందమూరి లక్ష్మీపార్వతి మండిపడ్డారు. లోకేష్‌ను సీఎం చేసేందుకు నారా భువనేశ్వరి క్షుద్ర పూజలు చేయించింద‌ని ఆరోపించారు.

దేవాల‌య సంప్రదాయాల‌ను పూర్తిగా నాశ‌నం చేసిన చంద్రబాబుకు ఆల‌యాల గురించి మాట్లాడే అర్హత లేదని... విజయవాడ దుర్గమ్మవారి గుడిలో, కాళహస్తిలో క్షుద్రపూజల గురించి బీజేపీ నేతలు అడగాలని నందమూరి లక్ష్మీపార్వతి డిమాండ్ చేశారు. గతంలో చెన్నారెడ్డిని ముఖ్యమంత్రి స్థానం నుంచి దింపేందుకు కాంగ్రెస్‌ మతపరమైన అల్లర్లు సృష్టించిందని... చంద్రబాబు కూడా అక్కడి నుంచే వచ్చారు కాబట్టి ఆయనలో కాంగ్రెస్‌ కల్చర్‌ పోలేదని లక్ష్మీపార్వతి అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: