అయ్యబాబోయ్.. వైవీ సుబ్బారెడ్డికి ఎంత భక్తో మీకు తెలుసా..?

Chakravarthi Kalyan
వైవీ సుబ్బారెడ్డి.. ఏపీ సీఎం జగన్ కు బాబాయి. జగన్ సీఎం అయ్యాక.. ఆయన్ను తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్‌ గా నియమించారు. వాస్తవానికి ఆయనకు అంత కంటే పవర్ ఫుల్ పదవి ఇవ్వాల్సింది. కానీ సమీకరణాలు కలసిరాలేదు. వైవీ సుబ్బారెడ్డి కూడా టీటీడీ ఛైర్మన్ పదవితో సంతృప్తిగా ఉన్నారు. స్వామివారు సేవలో నిమగ్నమయ్యారు. అయితే.. ఆయనపై ఇటీవల టీడీపీ అధినేత చంద్రబాబు హిందూధర్మం మీద నమ్మకం లేని వ్యక్తి అంటూ ఆరోపణలు చేశారు. దీనిపై వైసీపీ నేతలు మండిపడుతున్నారు.

తుడా చైర్మన్, టీటీడీ ఎక్స్‌ అఫిషియో సభ్యుడు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి అయితే ఏకంగా వైవీ సుబ్బారెడ్డి భక్తి చరిత్ర అంతా ఏకరవు పెట్టారు. సుబ్బారెడ్డి శ్రీవారి సేవకుడే కాక.. వెంకన్నకు ప్రధాన భక్తుడని  కొనియాడారు. సుబ్బారెడ్డి జంధ్యం వేసుకోని సద్‌బ్రాహ్మణుడన్న చెవిరెడ్డి.. నిష్ట, నియమాలతో 36 సార్లు, 41 రోజుల పాటు అయ్యప్ప మాల వేసి, శబరిమలైకి వెళ్లిన భక్తుడు సుబ్బారెడ్డి అన్నారు. ఆయన ప్రతిరోజు గోపూజ చేయకుండా ఇంట్లో నుంచి బయటికి రారని తెలిపారు.

అంతే కాదు.. సుబ్బారెడ్డి ప్రతిరోజు కనీసం 45 నిమిషాల పాటు భగవంతునికి పూజ చేయకుండా ఏ పనికీ వెళ్లరట. ఆయన ఇప్పటికే 12 జ్యోతిర్లింగాలు, 18 అష్టాదశ పీఠాలను దర్శించారట. అమరనాథ్, మానస సరోవరం సైతం అనేక సార్లు దర్శించిన మహా భక్తుడట. ప్రతిరోజు ఇంట్లో మనుసూక్తం, నమకం, ఛమకం, శ్రీ సూక్తం, పురుష సూక్తాలతో పాటు అభిషేకాలు చేస్తున్న కుటుంబం సుబ్బారెడ్డిదని అన్నారు చెవిరెడ్డి.

ఇప్పటికే సుబ్బారెడ్డి తన ఇంట్లో కోటిసార్లు లలిత సహస్రనామం, కోటిసార్లు విష్ణుసహస్రనామ పారాయణం చేయించారని... లోకకల్యాణం కోసం సహస్ర చండీయాగం, శత చండీయాగం సైతం చేసిన చరిత్ర వైవీ సుబ్బారెడ్డిదని చెవిరెడ్డి గుర్తు చేశారు. 40 సంవత్సరాలుగా దేశంలో జరిగిన ప్రతి పుష్కారాలకు,  కుంభమేళాలకు వెళ్లి సుబ్బారెడ్డి స్నానమాచరించారు. సద్‌బ్రాహ్మణుడితో సమానంగా భగవంతునిపై భక్తి, భయం, శ్రద్ధ, నిష్ట కలిగిన సుబ్బారెడ్డి వంటి పరమభక్తుడిపై చంద్రబాబు విమర్శలు చేయడం బాధాకరమంటున్న చెవిరెడ్డి... వైవీ కుటుంబానికి భక్తిలో చంద్రబాబు కుటుంబం మరో జన్మ ఎత్తినా సాటిరాదని తెల్చి చెప్పేశారు.     

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: