హమారా.. హైదరాబాద్.. మరోసారి దేశంలోనే బెస్ట్..?

Chakravarthi Kalyan
హైదరాబాద్.. తెలుగు రాష్ట్రాల్లో ఎందరికో ఇది ఆత్మీయ నగరం.. తెలుగు రాష్ట్రాల్లోని ప్రతి గ్రామంతోనూ హైదరాబాద్‌కు అనుబంధం ఉందంటే అతిశయోక్తి కాదు.. హైదరాబాద్‌లో స్థిర నివాసం ఏర్పరచుకున్నవారో.. బంధువులో.. ఎవరో ఒకరు లేని కుటుంబాలు కూడా చాలా తక్కువ. ఇప్పుడు వారంతా ఆనందపడే వార్త ఇది. మన హైదరాబాద్ ఇప్పుడు దేశంలోనే బెస్ట్ సిటీగా పేరు తెచ్చుకుంటోంది. ఆ మధ్య సీసీ కెమేరాల విషయంలో ప్రపంచంలోనే బెస్ట్ సిటీగా పేరు తెచ్చుకున్న హైదరాబాద్ ఇప్పుడు మరో సంస్థ నుంచి కూడా దేశంలోనే బెస్ట్ సిటీగా  గుర్తింపు పొందింది.

ప్రముఖ పర్యాటక వెబ్ సైట్ హాలిడిఫై.కామ్‌ దేశంలోని 34 నగరాలను పరిశీలించి దేశంలోనే అత్యంత నివాసయోగ్య నగరంగా హైదరాబాద్‌ ను గుర్తించింది. అభిరుచులకు అనుగుణంగా సరైన పర్యాటక ప్రాంతాలను ఎంచుకోవడం, అక్కడికి చేరుకునేలా పర్యాటకులకు సాయంచేయడంలో హాలిడిఫై.కామ్‌ వెబ్‌సైట్‌ కు మంచి పేరుంది. మరి ఏ ఏ అంశాల ఆధారంగా ఈ సర్వే జరిగిందనే విషయం పరిశీలిస్తే..  నివాస వసతి, ఉపాధి అవకాశాలు వంటి అంశాలను ఆధారంగా ఈ సర్వే నిర్వహించారట.

దేశవ్యాప్తంగా పర్యాటకులు చూడదగిన ప్రదేశాలు ఉండటం.. ఆ ప్రదేశాల్లో మంచి సౌకర్యాలు ఉండటం, సంస్కృతి, సంప్రదాయాలకు చిరునామాలుగా మారిన పర్యాటక ప్రాంతాలు ఉండటం  హైదరాబాద్‌ ర్యాంకింగ్‌ను మరింత మెరుగుపరిచాయని చెప్పొచ్చు. చారిత్రక కట్టడాలైన చార్మినార్‌, గోల్కొండ కోట, ఎన్నో హంగులతో రూపుదిద్దుకున్న రామోజీ ఫిల్మ్‌ సిటీ చూడదగ్గవని ఈ సంస్థ తన గుర్తింపు పత్రంలో ప్రత్యేకంగా పేర్కొంది. ఇక  హైదరాబాద్‌ పర్యటనకు సెప్టెంబరు నుంచి మార్చి వరకు మంచి సమయమని ఈ వెబ్ సైట్ చెబుతోంది.  
ఈ సర్వేలో హైదరాబాద్‌ తర్వాత స్థానాల్లో ముంబయి, పుణె, చెన్నై, బెంగళూరు ఉన్నాయి. ఆ మధ్య జేఎల్‌ఎల్‌-2020 సూచీలోనూ హైదరాబాద్‌ ప్రపంచంలోనే ఉత్తమ డైనమిక్‌ సిటీ గా గుర్తింపు సాధించింది.  ఢిల్లీ వంటి నగరాలను కాలుష్యం వణికిస్తోంది. ముంబై, కోల్‌కతా వంటి నగరాల్లో పారిశుధ్యం ప్రశ్నార్థకంగా మారుతోంది. మన హైదరాబాద్ ను మరింత ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేస్తే.. అన్ని అంశాల్లోనే దేశంలోనే నెంబర్‌ వన్‌ గా నిలుస్తుందనడంతో సందేహం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: