చైనాకు వణుకుపుట్టించేలా.. ఆ దేశంతో భారత్ ఒప్పందం..?

Chakravarthi Kalyan
చైనాతో ఘర్షణ నేపథ్యంలో భారత్ సర్కార్‌ ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటోంది. చైనాకు ముకుతాడు వేయడానికి ఉన్న అన్ని అవకాశాలను వినియోగించుకుంటోంది. ఏ  చిన్న అవకాశాన్ని కూడా వదలిపెట్టడం లేదు. అందులో భాగంగానే భారత్ తాజాగా జపాన్ దేశంలో ఓ కీలక ఒప్పందం చేసుకుంది. భారత్ -జపాన్  బంధం గురువారం మరో మైలురాయిని చేరింది. ఎన్నో ఏళ్ల పాటు సాగిన సంప్రదింపుల అనంతరం రక్షణ రంగంలో కీలక ఒప్పందాన్ని ఇరుదేశాలు కుదుర్చుకున్నాయి .
ఇప్పుడు ఈ ఒప్పందం గురించి వింటే చైనాకు వణుకుపుట్టించేలా ఉంది. ఈ ఒప్పందం ద్వారా భారత్ -జపాన్  సైన్యాలు లాజిస్టిక్స్ పరంగా పరస్పర సహకారం పొందవచ్చు. ఆసియాలో చైనా ప్రాబల్యం పెరుగుతున్న తరుణంలో ఈ కీలక ఒప్పందానికి ప్రాధాన్యం ఏర్పడింది. భారత రక్షణశాఖ కార్యదర్శి అజయ్  కుమార్, జపాన్  రాయబారి సుజుకి సతోషి ఈ ఒప్పందంపై సంతకాలు చేసినట్టు భారత రక్షణ శాఖ వెల్లడించింది.
ఇండియా- జపాన్ కుదుర్చుకున్న ఈ ఒప్పందంతో ఇరు దేశాల మధ్య రక్షణ రంగంలో సహకారం మరింత బలపడుతుంది. మరమ్మతులు, ఇతర అవసరాల కోసం ఒక దేశ సైనిక శిబిరాన్ని మరో దేశం వినియోగించుకోవచ్చు. ఈ నేపథ్యంలో జపాన్  ప్రధాని షింజో అబేతో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఫోన్ లో మాట్లాడారు. ఈ  ఒప్పందం కుదరడాన్ని ఇరువురు స్వాగతించారు.  రక్షణ రంగంలో ఇరు దేశాల సహకారం మరింత శక్తిమంతంగా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
అబేతో ఫోన్‌లో మాట్లాడిన సమయంలో మోడీ జపాన్  అభివృద్ధిలో అబే పాత్రను మెచ్చుకున్నారు. భారత్ -జపాన్  మైత్రి బలపడటంలోనూ షింజో అబే కీలక పాత్ర పోషించారని కొనియాడారు. మొత్తానికి ఇప్పుడు భారత్- జపాన్ మధ్య కుదిరిన ఈ ఒప్పందంపై చైనా గుర్రుగా ఉండి ఉంటుంది. అయితే కయ్యాలమారి చైనాకు అన్ని పొరుగుదేశాలతో ఉన్న శత్రుత్వం ఇండియాకు కాస్త లాభించే అంశమే. చైనాను కట్టడి చేసేందుకు ఈ దేశాలతో భారత్ మరింత సానుకూలంగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: