తెలుగు స్టూడెంట్ కు తెలుగులోనే షాక్ ఇచ్చిన మోడీ...?

Chakravarthi Kalyan
నిన్న తెలుగు భాషా దినోత్సవం.. గిడుగు రామ్మూర్తి పంతులు జయంతిని తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకోవడం ఆనవాయితీ.. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు చెప్పారు. అలా చెప్పినవారిలో ప్రధాని మోడీ కూడా ఉన్నారు. ఈ సందర్భగా మోడీ.. కొన్ని చమక్కులు మెరిపించారు. ఓ తెలుగు విద్యార్థితో మాటామంతీ కలిపారు. అంతే కాదు.. తెలుగులో ఓ పదం గురించి ఆయన ప్రత్యేకంగా పేర్కొన్నారు. ఆ పదం గురించి మిగిలిన వాళ్లకు చెప్పారా అంటూ ప్రశ్నించారు.

ఇంతకీ మోడీ ఆ విద్యార్థిని ఎలా కలిశారు.. ఏం మాట్లాడారు.. తెలుసుకుందాం.. నిన్న ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఝాన్సీలో నూతనంగా నిర్మించిన రాణీ లక్ష్మీబాయి వ్యవసాయ విశ్వవిద్యాలయ భవనం ప్రారంభోత్సవం జరిగింది. ప్రధాని మోడీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అక్కడ చదువుకుంటున్న వారిలో వివిధ రాష్ట్రాల విద్యార్థులతో ప్రధాని మాట్లాడారు. ఆ విద్యార్థుల్లో కృష్ణాజిల్లా విద్యార్థి టోనీ మనోజ్‌కుమార్‌ కూడా ఉన్నారు.

ప్రధాని మోడీ టోనీ మనోజ్ కుమార్ తో మాట్లాడుతూ... అంటే మీరు టోనీ గారా అంటూ చమత్కరించారు. అంతే కాదు.. ‘గారు’ అంటే అర్థమేంటో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన మీ ఫ్రెండ్స్ కు చెప్పారా అని ప్రశ్నించారు. ఈరోజు తెలుగు భాషా దినోత్సవం కాబట్టి తాను తెలుగులో మాట్లాడాలనుకుంటున్నానని మనోజ్‌ చెప్పగా.. అలాగే మాట్లాడండని మోడీ ప్రోత్సహించారు.

దీంతో మనోజ్‌ తెలుగులోనే మాట్లాడారు. ‘మీ సంక్షేమ, వ్యవసాయ కార్యక్రమాలు దేశానికి శుభకరంగా, ఆశీర్వాదకరంగా ఉన్నాయి. అందుకు ధన్యవాదాలు అంటూ మనోజ్ మాట్లాడారు. మనోజ్ తెలుగులో మాట్లాడినా ఆ మాటలు తనకు అర్థమయ్యాయన్నారు ప్రధాని. అంతే కాదు..  ఆంధ్రప్రదేశ్‌లో అధికంగా పండే చింత, పసుపు గురించి ఇక్కడి విద్యార్థులకు పరిచయం చేశారా? అని అడిగారు. తమ రాష్ట్రంలో అధికంగా పండే వరి, మామిడి, చింత, పొగాకు, పసుపు పంటల గురించి ఇక్కడున్న 22 రాష్ట్రాల విద్యార్థులకు తెలిపానని మనోజ్‌ చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: