ఏపీ వాతావరణ శాఖ కీలక ప్రకటన... రాష్ట్రంలో మరింత జోరుగా వర్షాలు...?
రేపు ఉత్తర బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది. కోస్తాంధ్ర, యానాం, రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో అల్ప పీడన ప్రభావం వల్ల మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. వాతావరణ శాఖ అధికారులు ఈ నెల 25 నుంచి క్రమంగా వర్షాలు పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. గంటకు 40 కిలో మీటర్ల నుంచి 50 కిలో మీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
అందువల్ల మత్స్యకారులు కొన్ని రోజుల పాటు వేటకు దూరంగా ఉండాలని పేర్కొన్నారు. గత 10 రోజులుగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. కృష్ణా, గోదావరి నదులు ఉప్పొంగుతున్నాయి. వర్షాల ధాటికి రాష్ట్రంలోని నదులు పొంగిపొర్లుతున్నాయి. నదీ తీర ప్రాంతాలలో నివశించే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
ఇదే సమయంలో భారీ వర్షాలు ఉన్నాయని ప్రకటించడంతో ప్రజల్లో భయాందోళన నెలకొంది. రాష్ట్రంలోని గోదావరికి భారీగా వరద పోటెత్తడంతో... తూర్పుగోదావరి జిల్లాలోని మన్యంతోపాటు కోనసీమ లంక గ్రామాలు ఇంకా జలదిగ్భంధంలోనే ఉన్నాయి. ఇప్పటికే కురిసిన భారీ వర్షాలకు పలు గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. తూర్పుగోదావరి జిల్లాలో 180 గ్రామాలు వరద ముంపుకు గురయ్యాయి. మొత్తం 82 గ్రామాల్లోకి వరద నీరు చేరగా ముగ్గురు మృతి చెందారు. భారీ వర్షాల వల్ల పలు ప్రాంతాల్లో పంట పొలాలు ధ్వంసమయ్యాయి.