నార్సింగ్ లో వ్యక్తి ప్రాణం తీసిన గేదె... అసలేం జరిగిందంటే...?

Reddy P Rajasekhar
కాలం మారుతోంది. టెక్నాలజీ పెరుగుతోంది. అదే సమయంలో ప్రమాదాల సంఖ్య కూడా అంతకంతకూ పెరుగుతోంది. రోడ్డుపై అడుగు పెడితే ఇంటికి క్షేమంగా వెళతామో లేదో చెప్పలేని పరిస్థితి నెలకొంది. ప్రమాదం ఏ వైపు నుంచి ముంచుకొస్తోందో ఎవరిని మింగేస్తోందో తెలియట్లేదు. తాజాగా హైదరాబాద్ లోని నార్సింగ్ ఊహించని విధంగా ప్రమాదం చోటు చేసుకుంది. నడుచుకుంటూ వెళుతున్న వ్యక్తి గేదె వల్ల ప్రాణాలు కోల్పోయాడు. వేగంగా దూసుకొచ్చిన గేదె తగలడంతో తీవ్ర గాయాలపాలై వ్యక్తి మృతి చెందాడు.
 
పూర్తి వివరాలోకి వెళితే నార్సింగ్ ఏరియాలోని జన్వాడకు చెందిన 52 సంవత్సరాల నర్సయ్య అనే వ్యక్తి కూలిపనులు చేసుకుంటూ జీవనం సాగించేవాడు. రోజులానే ఈరోజు కూడా పనులను ముగించుకుని ఇంటికి బయలుదేరాడు. కానీ గేదె రూపంలో ఊహించని ప్రమాదం ఆయన ప్రాణాలను బలిగొంది. ఖానాపూర్ నుంచి జన్వాడకు నడుచుకుంటూ వెళుతున్న నర్సయ్యను వేగంగా పరుగెత్తుతూ వెళుతున్న గేదె ఢీ కొట్టింది.
 
గేదె కొమ్ములు బలంగా తగలడంతో నర్సయ్యకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు ఆంబులెన్స్ కు ఫోన్ చేశారు. బాధితుడు నర్సయ్యను చికిత్స కోసం సమీపంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. వైద్యులు నర్సయ్య పరిస్థితి తీవ్ర విషమంగా ఉందని ఉస్మానియా ఆస్పత్రికి తీసుకొని వెళ్లాలని సూచించారు. అనంతరం ఆయనను ఉస్మానియా ఆస్పత్రికి తీసుకెళ్లగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు.
 
పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. నర్సయ్య మృతితో ఆయన కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. నర్సయ్య మృతి వల్ల స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి. ఒకవైపు కరోనా విజృంభిస్తుంటే ఊహించని విధంగా చోటు చేసుకుంటున్న ప్రమాదాలు ప్రజలను మరింత భయాందోళనకు గురి చేస్తున్నాయి. ప్రజలు ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా అనుకోని విధంగా ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఊహించని ప్రమాదాలకు సంబంధించిన వార్తలు ప్రజలను భయాందోళనకు  గురి చేస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: