కరోనా: మీ ఇంట్లో ఈ పరికరం ఉంటే.. కరోనాను జయించొచ్చు..!?
మరి ఇదంతా ఎందుకు జరుగుతుంది. లక్షణాలు పెద్దగా లేకపోయినా.. ఒక్కసారిగా ఎందుకు కరోనా రోగులు కుప్పకూలుతున్నారు.. అలా కాకుండా ఉండాలంటే ఏం చేయాలి.. ఇది ఇప్పుడు అందరూ తెలుసుకోవాల్సిన అంశం. కరోనా లక్షణాలు పెద్దగా లేకపోయినా.. శరీరంలో ఆక్సిజన్ శాతం తగ్గిపోతే.. ఉన్నపళంగా మృత్యువు ముంచుకొస్తుంది. ఈ మధ్య కొందరు కరోనా రోగుల రక్తంలో ఆక్సిజన్ శాతం 95 కంటే తక్కువకు పడిపోతోంది. ఇలాంటప్పుడు శ్వాస తీసుకోవడం కష్టమై ఆయాసంగా ఉంటుంది.
మరి ఇలాంటప్పుడు ఏం చేయాలి.. ఆక్సీమీటర్‌తో పరీక్షిస్తుండాలి. శరీరంలో ఆక్సీజన్ శాతం 90 శాతం కంటే తక్కువగా ఉంటే అత్యవసరంగా ఆసుపత్రిలో చేరాల్సి ఉంటుంది. ఈ విధంగా వైరస్ దాడి తీరు, శరీరంలో దుష్ప్రభావాలు తెలిశాయి కాబట్టి.. దానికి ఏ సమయంలో ఎటువంటి చికిత్స అందించాలనే విషయంలోనూ స్పష్టత ఏర్పడుతుంది. సరైన సమయంలో చికిత్స అందించడం వల్ల మరణాల సంఖ్య కూడా తగ్గిపోతుంది.
కానీ కొందరు ఆలస్యంగా ఆసుపత్రికి వస్తున్నారు. ఇలాంటి వారిలో అప్పటికే శరీరంలో అంతర్గత వ్యవస్థ దెబ్బతిని ఉండడంతో.. సమస్య తీవ్రమై ప్రాణాపాయ పరిస్థితులకు దారితీస్తోంది. కొందరిలో హ్యాపీ హైపాక్సియా అనే లక్షణం ఉంటుంది. అంటే వీరిలో రక్తంలో ఆక్సిజన్ శాతం 80-85 ఉన్నా పైకి మాత్రం మామూలుగానే కనిపిస్తారు. ఇలాంటి వారిలోనే ఉన్నట్టుండి పరిస్థితి విషమిస్తుంది. వీరిలోని కొందరిలో నేరుగా దాని ప్రభావం గుండెపై ప్రభావం చూపుతుంది. ఉన్నట్టుండి గుండె లయ తప్పడం వల్ల ప్రాణాలమీదకు వస్తుంది. అందుకే కరోనా రోగులు తరచూ ఆక్సీమీటర్ తో ఆక్సీజన్ స్థాయిలు తెలుసుకోవాలి. 95 శాతానికి తగ్గితే అర్జంటుగా ఆసుపత్రికి వెళ్లాలి.