రెండు గంటల్లో హైదరాబాద్ టు విజయవాడ...?

Chakravarthi Kalyan
హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లాలంటే ఎంత సమయం పడుతుంది.. రైళ్లో అయినా బస్సులో అయినా కనీసం ఐదారు గంటలు పడుతుంది.. కానీ.. సింపుల్ గా రెండు గంటలలోనే విజయవాడ వెళ్లే మార్గం ఉంటే ఎంత బావుంటుంది... చాలా బావుంటుంది కదా.. అయితే ఆ కల నెరవేరే రోజు ఎక్కువ దూరంలో లేదంటున్నారు తెలంగాణ మంత్రి కేటీఆర్.. దిల్లీ-వారణాసి మధ్య నడిచే వందే భారత్‌ లాంటి హైస్పీడ్‌ రైళ్లు మరిన్ని వస్తే ఇతర ప్రాంతాలకు తక్కువ సమయంలో చేరుకోవచ్చని చెబుతున్నారు.

రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండలం కొండకల్‌ గ్రామంలో మేధా సంస్థ రైల్‌ కోచ్‌ పరిశ్రమకు కేటీఆర్ శంకుస్థాపన చేసిన సమయంలో ఈ విషయం చెప్పారు.  త్వరలోనే  హైదరాబాద్‌ నుంచి గంటలో కరీంనగర్‌, రెండు గంటల్లో విజయవాడ, నాలుగు గంటల్లో బెంగళూరు చేరుకునే రోజులు వస్తాయన్నారు. తెలంగాణ ఏర్పడ్డాక గత ఆరేళ్లలో ఎన్నో నూతన పరిశ్రమలు సాధించామని కేటీఆర్‌ అంటున్నారు.  స్థానికులకు 50 నుంచి 60 శాతం ఉద్యోగాలుకల్పిస్తే అదనపు ప్రోత్సాహకాలు ఇస్తున్నామని తెలిపారు తెలంగాణ మంత్రి కేటీఆర్.

ఇక ఈ మేధా పరిశ్రమ విషయానికి వస్తే.. ఇది..  106 ఎకరాల్లో ఏర్పాటవుతోంది. ఈ సంస్థ యజమాని తెలంగాణకు చెందిన యుగంధర్‌రెడ్డి. ఆయన ఈ సంస్థను  1984లో స్థాపించారు. మొదట్లో చిన్న చిన్న ప్రాజెక్టులు చేపట్టిన ఈ సంస్థ ఇప్పుడు  రైలు కోచ్‌లు, లోకోలు తయారు చేసే స్థాయికి ఎదిగింది.

ఈ మేధా సంస్థ గంటకు 160 కిలో మీటర్ల వేగంతో నడిచే వందే భారత్‌ రైలుకు సిగ్నలింగ్‌, అనేక పరికరాలు తయారు చేసింది. రూ.1,000 కోట్ల పెట్టుబడితో కొండకల్‌లో తలపెట్టిన ఈ పరిశ్రమ వల్ల  ప్రత్యక్షంగా 1000 మందికి, పరోక్షంగా వేలాది మందికి ఉపాధి లభించనుంది.  రైల్‌ కోచ్‌ పరిశ్రమలో మొదటి యూనిట్‌ను 15 నుంచి 18 నెలల్లో పూర్తి చేసి ముఖ్యమంత్రితో ప్రారంభించాలన్నది సంస్థ ఆలోచన.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: