బాబోయ్..! ఏంటి చంద్రబాబు ఇలాగ అయిపోయారు..?

Chakravarthi Kalyan
రాజకీయ చాణక్యుడిగా పేరుపడిన చంద్రబాబు పరిస్థితి రోజురోజుకూ దిగజారుతోందా.. ఆయన చాణక్య నీతి పెద్దగా పని చేయడం లేదా.. ఆయన రాజకీయ ఎత్తుగడలు ఎదురుతిరుగుతున్నాయా.. మొత్తానికి చంద్రబాబు ఎత్తులు- పై ఎత్తుల పని అయిపోయిందా.. అన్న అనుమానాలు కలుగుతున్నాయి.. తాజాగా ఆయన అమరావతి విషయంలో వేసిన డెడ్ లైన్ ఎత్తుగడ చివరకు ఆయన్ను నవ్వుల పాలు చేసిందని విశ్లేషకులు భావిస్తున్నారు.

సాధారణంగా ఎవరైనా సవాల్ చేస్తే.. ఇదిగో నేను రాజీనామా చేస్తున్నా.. మళ్లీ పోటీ చేస్తా.. దమ్ముంటే నా పై పోటీ చేయండి అని సవాల్ చేస్తారు.. గతంలో సవాల్ చేసిన వాళ్లంతా ఇలాగే చేశారు. పోనీ చంద్రబాబు రాజీనామా చేయకపోయినా.. తన పార్టీ వాళ్లతో అయినా ఒకరిద్దరితో రాజీనామా చేయించి ఉంటే.. జనంలో చర్చ జరిగేది.. రాజధానిలో భాగంగా ఉన్న విజయవాడ తూర్పు టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావుతోనైనా.. గుంటూరు జిల్లాలో ఉన్న రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ తోనైనా రాజీనామా చేయించి ఉంటే.. ఆ సవాల్ కు అర్థం ఉండేది.  

అదీ కాకుంటే.. విశాఖపట్నంలో టీడీపీకి నలుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు.. వారైనా తమకు ఇక్కడ కార్యనిర్వాహక రాజధాని వద్దని చెప్పి వాళ్లతో రాజీనామా చేయించవచ్చు కదా.. కర్నూలులో హైకోర్టును ఒప్పుకోబోమని చెప్పి.. సీమ నుంచి ఎన్నికైన తన  బావమరిది బాలకృష్ణ, పయ్యావుల కేశవ్ లతో రాజీనామా చేయించవచ్చు కదా.. అదీ చేయలేదు. ఎందుకు.. వీరిలో ఏ ఒక్కరూ మళ్లీ గెలుస్తారన్న నమ్మకం లేదనుకోవాలా.. ?

కానీ చంద్రబాబు చేసిందేంటి.. అమరావతితో సంబంధంలేని ఎమ్మెల్సీ బీటెక్ రవితో రాజీనామా చేయంచారు. దీనివల్ల ఒరిగిందేమిటీ.. మహా అయితే బీటెక్ రవి సభ్యత్వం పోతుంది. మళ్లీ ఎన్నికలు వచ్చినా అవి ప్రత్యక్ష ఎన్నికలు కావు.. కాబట్టి ఆ సీటు కూడా వైసీపీయే గెలుచుకుంటుంది. ప్రత్యక్ష ఎన్నికలు జరిగే ఎమ్మెల్యేలతో కాకుండా.. పరోక్ష ఎన్నిక జరిగే బీటెక్ రవితో చేయించడం ఏం వ్యూహం..? ఇవన్నీ చూసిన వాళ్లలో కాస్తో కూస్తో ఐడియా ఉన్నవాళ్లు కూడా ఇదేంటబ్బా.. చంద్రబాబు ఇలాగయ్యారు అని ఆలోచనలో పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: