బెదిరింపులు వస్తున్నాయ్ .. జగన్ ని కలుస్తా ? ఇదేంటి రఘురామా ?

నరసాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు వ్యవహార శైలిలో ఇప్పుడు మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటి వరకు వైసీపీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ వచ్చిన ఆయన, ఢిల్లీకి వెళ్లి ఎన్నికల సంఘానికి వైసీపీపై ఫిర్యాదు చేశారు. తనకు జారీ చేసిన షోకాజ్ నోటీసు చెల్లుతుందా లేదా అనే విషయంపై క్లారిటీ తీసుకునే ప్రయత్నం చేశారు. అదే విధంగా ఈ రోజు లోక్ సభ స్పీకర్ తో పాటు, అనేక మంది కేంద్ర మంత్రుల ను కూడా కలిశారు. అలాగే కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ను కలిశారు. ఇక హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డితో భేటీ అవుతున్నట్లు తెలుస్తోంది. వరుసగా బీజేపీ కీలక నాయకులు అందరితోనూ రఘురామకృష్ణరాజు సమావేశం అవుతుండడడంపై వైసీపీ కూడా ఆరా తీస్తోంది. ఇదిలా ఉంటే ఆయన మీడియాతో మాట్లాడుతూ, తన ఢిల్లీ పర్యటనకు, వైసిపి వ్యవహారాలకు సంబంధం లేదని, తాను ఎప్పుడూ ముఖ్యమంత్రిని వ్యతిరేకించలేదని, వ్యతిరేకించనని, మీడియాకు స్పష్టం చేస్తున్నారు.


 అలాగే ప్రభుత్వానికి తాను ఒకటి రెండు అంశాలపై సూచనలు మాత్రమే చేశానని, జగన్ ను కలిసే అవకాశం వస్తుందని అనుకోవడం లేదని , అయినా అపాయింట్మెంట్ ఇవ్వాల్సిందిగా కోరినట్లు రఘురామ కృష్ణంరాజు చెప్పారు. తనకి పార్టీ అధ్యక్షుడికి మధ్య దూరం పెంచేందుకు కొంతమంది ప్రయత్నిస్తున్నారని, వైసిపి నాయకులు, కార్యకర్తల నుంచి బెదిరింపు ఫోన్ కాల్స్ వస్తున్నాయని, అందుకే కేంద్ర బలగాలతో రక్షణ కల్పించాలని కిషన్ రెడ్డిని కలిసి కోరినట్లు ఆయన చెప్పారు. తాను ఢిల్లీలో ఇతర నాయకులను మర్యాదపూర్వకంగానే కలుస్తానని, తనకు ఇచ్చిన షోకాజ్ నోటీసు విషయంలో త్వరలోనే స్పందిస్తానని అన్నట్టుగా రఘురామకృష్ణంరాజు సమాధానం ఇస్తున్నారు. 


ఇప్పటికే పార్టీ జారీ చేసిన షోకాజ్ నోటీసుపై సలహాలు తీసుకుని తనకు షోకాజ్ నోటీసులు ఇవ్వడం సరికాదని అన్నారు. ఇలా వెనక్కి తగ్గినట్టు తగ్గి ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ రఘురామకృష్ణం రాజు వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే ఆయన వైసీపీలో ఉండాలనుకుంటున్నాడా ? వెళ్లాలనుకుంటున్నాడా ? అసలు ఏ ఉద్దేశంలో ఉన్నాడు అనే విషయంపై ఇప్పుడు వైసీపీ లో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: