అన్ లాక్ 1.0 : హైదరాబాద్ లో కరోనా డేంజర్ బెల్స్.... ఆ ఏరియాల్లో విజృంభిస్తోన్న వైరస్....?
దేశంలో, తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ శరవేగంగా విజృంభిస్తోంది. కరోనా బాధితుల సంఖ్య, మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. రాష్ట్రంలో నమోదైన కేసుల్లో 62 శాతం కేసులు హైదరాబాద్ లోనే నమోదయ్యాయంటే ఇక్కడ పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అన్ లాక్ 1.0 లో భాగంగా అమలు చేసిన లాక్ డౌన్ సడలింపుల వల్లే ఈ స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. కరోనా మరణాల్లోను 80 శాతం మరణాలు హైదరాబాద్ లోనే నమోదు కావడం గమనార్హం.
హైదరాబాద్ లోని అసిఫ్ నగర్, బంజారాహిల్స్, గోషామహల్, పంజాగుట్ట ప్రాంతాల్లో అధిక సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో మార్చి 2వ తేదీన తొలి కేసు నమోదైంది. లాక్ డౌన్ అమలు సమయంలో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో వైరస్ తగ్గుముఖం పట్టినా హైదరాబాద్ లో మాత్రం కేసులు నమోదవుతూనే వచ్చాయి. హైదరాబాద్ లో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల్లో సగం కేసులు లాక్ డౌన్ సడలింపుల తర్వాతే నమోదు కావడం గమనార్హం.
నగరంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ప్రభుత్వం లాక్ డౌన్ నిబంధనలు కఠినంగా అమలు చేస్తోంది. నగరంలో ప్రస్తుతం 154 కంటైన్మెంట్ జోన్లు ఉన్నాయి. ప్రజలు మాస్క్ ధరించి, భౌతిక దూరం పాటిస్తే మాత్రమే వైరస్ భారీన పడకుండా కాపాడుకోవచ్చని వైరస్ నియంత్రణలో ప్రజల సహకారం చాలా అవసరం అని నిపుణులు చెబుతున్నారు. మరోవైపు హైదరాబాద్ లోని కొన్ని కార్పొరేట్ ఆస్పత్రుల్లో కరోనాకు చికిత్స అందుబాటులో ఉంది.
దీంతో పలు జిల్లాల నుంచి కరోనా అనుమానితులు ప్రైవేట్ అస్పత్రులను ఆశ్రయిస్తున్నారు. కరోనా అనుమానితులతో ప్రైవేట్ ఆస్పత్రులు కిటకిటలాడుతున్నాయి. కొన్ని ఆస్పత్రులలో పైరవీలు చేయించుకుంటే మాత్రమే పడక లభ్యమయ్యే అవకాశం ఉంది. రాబోయే కాలంలో కేసుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.