అంతర్గతంగా రగులుతోన్న చైనా... అందువల్లే వివాదాలు...?
డ్రాగన్ దేశం తన వక్ర బుద్ధిని మార్చుకోవడం లేదు. యుద్ధ ఘీంకారాలు చేస్తూ భారత్ లోని భూభాగాన్ని తమ దేశం భూభాగమంటూ ప్రకటనలు చేస్తోంది. చైనా భారత్ తో మాత్రమే కాదు... ఇతర దేశాలతో కూడా ఇదే విధంగా వివాదాలకు సిద్ధమవుతోంది. చైనాలో ఉన్న అంతర్గత పరిస్థితుల వల్లే వివాదాలు చెలరేగుతున్నాయని తెలుస్తోంది. థాయ్ లాండ్, వియత్నాం, కంబోడియా దేశాలతో కూడా చైనాకు వివాదాలు ఉన్నాయి.
చైనా అడ్డుకట్టలు కట్టి ఆయా దేశాలకు నీళ్లు లేకుండా చేసి ఆ దేశాలలో కరువుకాటకాలకు కూడా కారణమవుతోంది. తైవాన్, టిబెట్, హాంగ్ కాంగ్ కూడా మావేనని ఆ దేశం చెబుతూ వస్తోంది. మరోవైపు చైనా దేశ ఆర్థిక వ్యవస్థ పతనం దిశగా పయనిస్తోందని తెలుస్తోంది. 1990 తరువాత ఇలాంటి పరిస్థితిని చైనా ఎదుర్కోవడం ఇదే తొలిసారి. కరోనా వైరస్ విజృంభణ వల్ల అక్కడ ప్రస్తుతం దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయి.
ప్రస్తుతం చైనాలో తలసరి ఆదాయం 140 డాలర్లకు మించి లేదు. అక్కడ నూటికి 70 శాతం మంది పేదరికంలోనే ఉన్నారు. చైనాలోని అధికారంలో ఉన్న పార్టీలో విబేధాలు ఉన్నాయి. కొంతమంది నేతలు వివిధ కారణాల వల్ల జైళ్లలో ఉన్నారు. వారికి అనుకూలంగా కొందరు నేతలు వ్యవహరిస్తూ ఉండటం ఆ దేశానికి తలనొప్పిగా మారింది. వన్ బెల్ట్ వన్ రోడ్ నిర్మాణం కోసం చైనా ప్రపంచ దేశాలకు అప్పులు ఇచ్చింది.
ఆ రహదారి నిర్మాణం ఆగిపోతే చైనా మరిన్ని ఇబ్బందులు పడే అవకాశం ఉంది. జనావాసాలు ఉన్న చోట నిర్మాణాల వల్ల ఉపయోగం ఉంటుంది కానీ లేని చోట్ల ఏం చేసినా ఎలాంటి ప్రయోజనం ఉండదు. ప్రపంచ దేశాల నుంచి డబ్బులు రాబట్టుకునే స్థితిలో చైనా లేదు. పాక్ ఆక్రమిత కశ్మీర్ ను భారత్ ఆక్రమిస్తే మాత్రం చైనా మరిన్ని ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంది. చైనాలో ఉన్న ఈ అంతర్గత సమస్యల వల్లే ఆ దేశం సరిహద్దు వివాదాలను సృష్టిస్తోందని విశ్లేషకులు చెబుతున్నారు.