తెలంగాణలో నాలుగు నెలల చిన్నారికి కరోనా పాజిటివ్... ఆ జిల్లాల్లో పంజా విసురుతున్న వైరస్...?

Reddy P Rajasekhar

తెలంగాణ రాష్ట్రంలో గత కొన్ని రోజుల నుంచి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే కరోనా కేసులు నమోదయ్యాయి. కానీ తాజాగా ఇతర జిల్లాల్లో కరోనా వేగంగా విజృంభిస్తోంది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు కరోనా భారీన పడ్డారు. యాదాద్రి, జగిత్యాల, మంచిర్యాల జిల్లాల్లో ఇతర రాష్ట్రాల నుంచి రాష్ట్రానికి వచ్చిన వారు కరోనా భారీన పడుతున్నారు. రాష్ట్రంలో గత కొన్ని రోజుల నుంచి తక్కువ సంఖ్యలో కరోనా కేసులు నమోదు కాగా నిన్న ఒక్కరోజే 71 కేసులు నమోదయ్యాయి. 
 
నిన్న నమోదైన కేసుల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 38 కేసులు నమోదు కాగా రంగారెడ్డి జిల్లాలో ఏడు, మేడ్చల్‌‌లో ఆరు, ఇతర రాష్ట్రాల నుంచి వలసల ద్వారా 12, విదేశాల నుంచి వచ్చిన వారి ద్వారా 4 కేసులు నమోదయ్యాయి. గత కొన్ని రోజులుగా కేసులు నమోదు కాని సూర్యాపేట, వికారాబాద్, నల్లగొండ, నారాయణపేట్‌ జిల్లాల్లో ఒక్కో కరోనా కేసు నమోదైంది. నిన్న నమోదైన కేసులతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 1991కు చేరుకుంది. 
 
గత 14 రోజులుగా కేసులు నమోదు కాని నాలుగు జిల్లాల్లో నిన్న కరోనా కేసులు నమోదయ్యాయి. నారాయణపేట్‌ జిల్లా మక్తల్‌ మండలంలోని జక్లేర్‌ గ్రామంలో నాలుగు నెలల బాలుడు కరోనా భారీన పడ్డాడు. జ్వరం, జలుబుతో బాధ పడుతున్న చిన్నారికి వైద్యులు పరీక్షలు నిర్వహించగా కరోనా నిర్ధారణ అయింది. దీంతో బాలుడి తల్లిదండ్రులను అధికారులు క్వారంటైన్ కేంద్రాలకు తరలించారు. 
 
వికారాబాద్‌ జిల్లా తాండూరులో ఏడాది బాలుడికి కరోనా నిర్ధారణ అయింది. బాలుడి మేనమామకు కూడా తాజాగా కరోనా నిర్ధారణ అయింది. దీంతో బాలుడి కుటుంబ సభ్యులను క్వారంటైన్ కేంద్రానికి తరలించారు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కరోనా తగ్గుముఖం పట్టి మరలా విజృంభించడంతో జిల్లాల్లో సెకండ్ వేవ్ మొదలైందని వైద్యులు చెబుతున్నారు. రాష్ట్రంలో కొత్త కేసులు నమోదైన ప్రాంతాల్లో అధికారులు లాక్ డౌన్ నిబంధనలు కఠినంగా అమలు చేస్తున్నారు. 
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: