విశాఖ ఉద్యమం అంటున్న పవన్ ? కలిసొచ్చేనా ?

రాజకీయంగా వేడి పెంచేందుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం లాక్ డౌన్ నిబంధనలు సడలిస్తున్న నేపథ్యంలో పవన్ క్షేత్ర స్థాయి రాజకీయాలపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టారు. ప్రజా సమస్యలను హైలెట్ చేసుకుని రాజకీయంగా పైచేయి సాధించాలని చూస్తున్నారు. అలాగే ఏపీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ ఇరుకున పెట్టాలని చూస్తున్నారు. 2014 ఎన్నికల నాటికి బలమైన రాజకీయ పార్టీగా రూపుదిద్దుకోవడమే కాకుండా అధికారం చేపట్టాలనే దిశగా అడుగులు వేస్తున్నారు. దానిలో భాగంగానే అనేక ప్రజా ఉద్యమాలకు శ్రీకారం చుట్టారు. కొద్ది రోజుల క్రితం సంచలనం సృష్టించిన విశాఖ గాస్ లీకేజ్ ఘటన పై పవన్  ఇప్పటికే ఏపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఇదంతా ప్రభుత్వ వైఫల్యమే అన్నట్లుగా పవన్ మాట్లాడారు. తాజాగా మరోసారి స్పందించారు . విశాఖ గ్యాస్ బాధితుల విషయంలో ఏపీ ప్రభుత్వం సరిగా స్పందించకపోతే తాను ఉద్యమిస్తాను అంటూ పవన్ తీవ్రస్థాయిలో హెచ్చరికలు చేశాడు. అలాగే గ్యాస్ ప్రభావానికి గురైన ప్రాంతాల ప్రజలకు తమ పార్టీ తరపున అండగా ఉంటానంటూ పవన్ ప్రకటించారు. ప్రశాంత జీవితం గడుపుతున్న ప్రజలపై స్టెరిన్ విషవాయువు తీవ్ర ప్రభావం చూపించిందని పవన్ అన్నారు.
 


 ఇవే విషయాలపై విశాఖ జనసేన నాయకులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన పవన్ అవసరమైతే స్టెరిన్ బాధితులకు అండగా ఉద్యమించేందుకు తాను సిద్ధం అంటూ ప్రకటించారు. ఏపీ ప్రభుత్వం ఇప్పటికే విశాఖ బాధితులకు నష్టపరిహారం కూడా ప్రకటించడమే కాకుండా, అతి తక్కువ సమయంలోనే బాధిత కుటుంబాలకు పరిహారం అందించారు. అలాగే ఎల్జి పాలిమర్స్ కంపెనీని మరోచోటికి తరలించే ప్రయత్నాల్లో భాగంగా ఇప్పటికే స్టెరిన్ గ్యాస్ ను తరలించే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. అయినా దీనిపై పెద్ద ఎత్తున ఉద్యమించేందుకు పవన్ సిద్ధమవుతున్నారు. అయితే ఈ వ్యవహారమంతా పూర్తిగా సద్దు మణిగిపోతుంది అనుకుంటున్న సమయంలో పవన్ దీనిని రాజకీయంగా తమకు అనుకూలంగా మార్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఈ ప్రయత్నాలు ఆయనకు ఎంత వరకు కలిసి వస్తుంది అనేది ప్రశ్నగా మారింది.


 ఈ వ్యవహారం లో ప్రభుత్వ పాత్ర పెద్దగా లేదు అనేది అక్కడి బాధితులకు తెలుసు. ఇది అనుకోని ఉత్పాతం. అలాగే ఎల్జీ పాలిమర్స్ కంపెనీ 60 సంవత్సరాల క్రితం స్థాపించబడింది. ఈ కంపెనీ కార్యకలాపాలు విస్తరించుకోవడానికి గత తెలుగుదేశం పార్టీనే అనుమతులు ఇచ్చింది. ఇక ఇప్పుడు ఈ ప్రమాదం జరిగిన తరువాత సహాయక చర్యలు దగ్గర నుంచి పరిహారం, స్టెరిన్ గ్యాస్ తరలింపు వరకు అన్నిటిలోనూ వైసీపీ ప్రభుత్వం వేగంగానే స్పందించింది. కానీ ఇప్పుడు దీనిపై జనసేన తరపున పవన్ ఉద్యమించినా కలిగే ప్రయోజనం మాత్రం అంతంతమాత్రంగానే ఉంటుంది అనే సూచనలు వస్తున్నాయి. 
 
 
 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: