ఏపీలో తగ్గుతున్న మద్యం వినియోగం... వారానికే భారీగా తగ్గిన ఆదాయం... కారణాలు ఇవే...?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లాక్ డౌన్ సడలింపుల్లో భాగంగా ప్రభుత్వం ఈ నెల 4వ తేదీ నుంచి రాష్ట్రంలో మద్యం అమ్మకాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మద్యపాన నిషేధంలో భాగంగా మద్యం ధరలను 75 శాతం పెంచింది. ప్రభుత్వం మద్యం ధరలను పెంచినా తొలి మూడు రోజులు మద్యం దుకాణాల దగ్గర మందుబాబులు క్యూ లైన్లలో బారులు తీరారు. కొన్ని ప్రాంతాలలో మందుబాబులు మాస్క్ లు ధరించలేదని, సామాజిక దూరం పాటించలేదని వార్తలు వచ్చాయి.
అయితే రాష్ట్రంలో శనివారం నుంచి లిక్కర్ అమ్మకాలు భారీగా తగ్గిపోయాయి. శనివారం రోజున మద్యం దుకాణాలు మూసే సమయానికి రాష్ట్రంలో కేవలం 40.77 కోట్ల రూపాయల మద్యం అమ్మకాలు మాత్రమే నమోదయ్యాయి. మే 4వ తేదీన మద్యం విక్రయాల ద్వారా ప్రభుత్వానికి 70 కోట్ల రూపాయల ఆదాయం రాగా మే 9వ తేదీ నాటికి ఆదాయం దాదాపు 30 కోట్లు తగ్గింది.
ప్రభుత్వం దుకాణాల సంఖ్యను 30 శాతం తగ్గించడం వల్ల ఆదాయం భారీగా తగ్గినట్టు అబ్కారీ అధికారులు అభిప్రాయపడుతున్నారు. సాధారణంగా వారాంతంలో మద్యం వినియోగం ఎక్కువగా ఉంటుంది. కానీ ధరల పెరుగుదల ప్రభావం మందుబాబులపై ఊహించిన దాని కంటే ఎక్కువ పడింది. రాష్ట్రంలో మద్యం రేట్లను చూసి మందుబాబులు భయపడుతున్నారు.
మరోవైపు రాష్ట్రంలో అధికారులు అక్రమ మద్యం అమ్మకాలు జరగకుండా చర్యలు చేపడుతున్నారు. ప్రభుత్వం ఇందుకోసం స్పెషల్ ఎన్ ఫోర్స్ మెంట్ బ్యూరో పేరిట ప్రత్యేక విభాగాన్ని నిర్వహిస్తోంది. రాష్ట్రంలో ప్రభుత్వం మద్యం దుకాణాల సంఖ్యను తగ్గించడంతో 13 జిల్లాల్లో 566 మద్యం షాపులు మూతబడ్డాయి. మరోవైపు మద్యం దుకాణాలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం వల్ల కరోనా కేసుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.