విశాఖ ఘటనపై స్పందించిన వెంకయ్య నాయుడు.. బాధితులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్ష..?
విశాఖపట్నంలో జరిగిన గ్యాస్ లీకేజీ ఘటన దేశవ్యాప్తంగా అందర్నీ దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. విశాఖ నగరంలోని ఆర్ ఆర్ వెంకటాపూర్ లో గల ఎల్జి పాలిమర్స్ అనే ప్లాస్టిక్ తయారీ కంపెనీ నుంచి ఈరోజు తెల్లవారుజామున భారీ మొత్తంలో విషవాయువులు వెలువడి దాదాపు మూడు కిలోమీటర్ల మేర వ్యాప్తి చెంది వందల మంది ప్రజలను అస్వస్థతకు గురి చేయడం ప్రస్తుతం అందరిని కలచివేస్తుంది. ఇక విశాఖ నగరంలో జరిగిన ఘటనతో ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం మొత్తం ఉలిక్కిపాటుకు గురయ్యింది . ఈ ఘటనపై ఏకంగా దేశ ప్రధాని నరేంద్ర మోడీ సైతం సమీక్ష నిర్వహించారు అంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
భారీ మొత్తంలో ప్లాస్టిక్ తయారీ కంపెనీ నుంచి గ్యాస్ లీక్ కావడంతో ఎంతో మంది గ్యాస్ పీల్చుకొని అపస్మారక స్థితిలోకి వెల్లి అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. వెంటనే స్పందించిన అధికారులు ఈ గ్యాస్ పీల్చుకొని అస్వస్థతకు గురైన ప్రజలందరినీ అంబులెన్స్ ద్వారా కేజిహెచ్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు వీరిలో చాలా మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. వాయువు ఊపిరితిత్తులలోకి వెళ్లడం ద్వారా పరిస్థితి మరింత విషమిస్తుంది అని డాక్టర్లు చెబుతున్నారు.
ఇక ఈ ఘటనపై స్పందిస్తున్న ఎంతోమంది ప్రముఖులు ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఈ ఘటన పై స్పందిస్తూ సానుభూతి వ్యక్తం చేశారు. అస్వస్థతకు గురైన బాధితులకు సానుభూతి వ్యక్తం చేసిన వెంకయ్యనాయుడు బాధితులు అందరూ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అటు రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి కూడా స్వయంగా విశాఖలో పరిస్థితిని సమీక్షించారు.