సీఎం సంచలన నిర్ణయం... 50 శాతం ఫీజులు తగ్గించాలని ప్రైవేట్ స్కూళ్లకు ఆదేశం...!
దేశంలో కరోనా మహమ్మారి మరణ మృదంగం మోగిస్తోంది. ప్రతిరోజూ వందల సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. దేశవ్యాప్తంగా నిన్నటివరకు 20,471 కరోనా కేసులు నమోదయ్యాయి. వీరిలో 3960 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అవ్వగా 652 మంది మృతి చెందారు. అయితే దేశంలో లాక్ డౌన్ అమలవుతూ ఉండటంతో విద్యాసంస్థలు మూతబడిన విషయం తెలిసిందే. దీంతో విద్యార్థులంతా ఇళ్లకే పరిమితమయ్యారు.
విద్యార్థులు ఏప్రిల్ నెలలో పాఠశాలకు హాజరు కాకపోయినా పలు విద్యాసంస్థలు ఫీజు చెల్లించాలని విద్యార్థుల తల్లిదండ్రులను డిమాండ్ చేస్తున్నాయి. ఈ విషయం తెలిసి అస్సాం సీఎం సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఏప్రిల్ నెలకు సంబంధించిన ఫీజులను 50 శాతం మేర తగ్గించాలని ప్రైవేట్ విద్యా సంస్థలకు ఆదేశాలు జారీ చేశారు. విద్యాశాఖ అధికారులు లాక్ డౌన్ వల్ల అనేక కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో సీఎం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు.
విద్యాశాఖ అధికారులు దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో ఫీజుల కొరకు విద్యార్థుల తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టవద్దని.... అదే విధంగా టీచర్ల వేతనాల్లో కోత విధించరాదని కోరామని చెప్పారు. దేశవ్యాప్తంగా లాక్ డౌన్ వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నా పలు ప్రాంతాల్లో ప్రైవేట్ విద్యాసంస్థలు తీరు మార్చుకోవడం లేదు.
విద్యార్థుల తల్లిదండ్రులకు ఫోన్లు చేసి ఫీజు చెల్లించాలని కోరుతున్నాయి. అదే సమయంలో టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది వేతనాల్లో కోత విధిస్తున్నాయి. దీంతో పలు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రైవేట్ పాఠశాలల విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్నాయి. ఇప్పటికే తెలంగాణ సర్కార్ రాబోయే విద్యాసంవత్సరానికి ఫీజులు పెంచరాదని ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు లాక్ డౌన్ ను పొడిగిస్తూ ఉండటంతో విద్యా సంవత్సరం ఆలస్యంగా ప్రారంభమవుతుందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన పడుతున్నారు.