ఈ ఫోన్లకు ఏమైంది.. ఒకటే దగ్గుతున్నాయిగా... చంపేస్తున్న కరోనా..?

Chakravarthi Kalyan
రెండు రోజులుగా మొబైల్ ఫోన్లన్నీ దగ్గుతున్నాయి. పాపం.. వాటికి కూడా జలుబు చేసినట్టుంది. ఫోన్లు దగ్గడం ఏమిటంటారా.. అవును ఇప్పుడు ఎవరికి ఫోన్ చేసినా ముందు వినిపించేది దగ్గులే.. కరోనా వ్యాధి వ్యాపిస్తున్న నేపథ్యంలో కరోనా వ్యాపించకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఫోన్ రింగ్ కంటే ముందు వినిపిస్తున్నారు.

కేంద్ర ఆరోగ్యశాఖ ఈ జాగ్రత్తలు తీసుకుంది. అందుకే ఎవరికి ఫోన్ చేసినా ముందు అర్జంటుగా ఈ దగ్గు వినిపిస్తుంది. కరోనా రాకుండా ఎలాంటి జాగ్రతలు తీసుకోవాలి.. అనే విషయాన్ని 30 సెకన్లలో వివరిస్తున్నారు. ఈ ప్రయత్నం బాగానే ఉంది. అయితే ఈ యాడ్ కేవలం ఇంగ్లీష్ లోనే ఉంది.

అలా కాకుండా ఏ ప్రాంతం వారికి ఆ భాషలో వివరిస్తే చాలా బావుంటుంది. కానీ అలాంటి ప్రయత్నం జరగకపోవడంతో ఫోన్లో ఏం వస్తుందో అర్థంకాక జనం విసుక్కుంటున్నారు. అంతే కాదు.. అర్జంటుగా ఫోన్లు చేసే వాళ్లు ఈ ముప్పై సెకన్ల ప్రకటన వచ్చే వరకూ అవతలి వ్యక్తికి రింగ్ కాకపోవడంతో అసహనంగా ఫీలవుతున్నారు.

ఈ ప్రకటన జాతీయ, ప్రాంతీయ బాషల్లో ఉంటే అందరికీ అర్థమవుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇటీవల కరోనా కోవిడ్‌-19 వైరస్‌ ప్రపంచాన్ని వణికిస్తున్న విషయం అందరికి తెలిసిందే. వారం రోజుల నుంచి మన భారత్‌లోను వ్యాపించినట్లు, ఇక్కడ కేసులు నమోదవుతున్నాయని ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటికే దేశంలో దాదాపు 50 కేసుల వరకూ నమోదయ్యాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: