ఏ ఊరికెళ్లినా జనం ఉరికించి కొడతారు.. కోమటిరెడ్డిపై ఎర్రబెల్లి సంచలన వ్యాఖ్యలు...?

Reddy P Rajasekhar

తెలంగాణ శాసనసభ బడ్జెట్ సమావేశాలు రెండోరోజు కొనసాగుతున్నాయి. ఈరోజు సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం ధన్యవాద తీర్మానం సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి మధ్య మాటల యుద్ధం నడిచింది. కోమటిరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందని అన్నారు. డబ్బు రాజకీయం చేసి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని ఆరోపణలు చేశారు. 
 
రాష్ట్రంలో కార్పొరేట్ ఆస్పత్రులు పేదల రక్తం తాగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శలు చేశారు. ప్రభుత్వ ఆస్పత్రులు నిర్వీర్యం అయ్యాయని... ప్రభుత్వ ఆస్పత్రులకు ప్రజలు వెళ్లే పరిస్థితులే లేవని అన్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా..? పార్టీకి, సీఎంకు ప్రజాస్వామ్యంపై గౌరవం ఉందా...? అంటూ ప్రశ్నించారు. ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల హామీని నెరవేర్చలేకపోతున్నామని ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. 
 
ప్రతిపక్ష నేతలు మాట్లాడే సమయంలో అధికార పార్టీ నేతలు పదేపదే అడ్డు తగులుతున్నారని అసహనం వ్యక్తం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు మంచిదే... అలాగే పాలమూరు - దిండి ఎత్తిపోతల పథకం ఎందుకు చేపట్టలేదని ప్రశించారు. రైతులకు 24 గంటల విద్యుత్ అవసరం లేదని 12 గంటల విద్యుత్ చాలని చెప్పారు. ప్రభుత్వం కంపెనీలు ఏర్పాటు చేస్తున్నా స్థానికులకు ఉద్యోగాలు దక్కడం లేదని విమర్శించారు. 
 
మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కోమటిరెడ్డి వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు. కోమటిరెడ్డి వ్యాఖ్యలు వింటుంటే తనకు చాలా బాధగా ఉందని అన్నారు. కోమటిరెడ్డి మాటలు వింటే ప్రజలు ఉరికొచ్చి కొడతారు... ఏం మాట్లాడుతున్నావ్... అంటూ హెచ్చరించారు. రాష్ట్రంలో కాళేశ్వరం ప్రాజెక్టు వల్లే రైతులు సుభిక్షంగా ఉన్నారని చెప్పారు. కోమటిరెడ్డి సభలోనే ఎర్రబెల్లి వ్యాఖ్యలకు స్పందించారు. ఎర్రబెల్లి మితిమీరి మాట్లాడుతున్నారని... అనవసర విషయాలలో జోక్యం చేసుకుంటున్నారని మండిపడ్డారు. కేసీఆర్ తెలంగాణ ద్రోహులను తెచ్చి నెత్తిన పెట్టుకుంటే ఇలాగే మాట్లాడతారని అన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: