మేనిఫెస్టో: ప్రజల నిజాయితీకే పరీక్ష పెట్టిన జగన్‌?

ఎన్నికల మేనిఫెస్టో అంటే జనం ఆశగా ఎదురు చూస్తారు. తమకేమి వరాలు ఇస్తారోనని ఆశపడతారు. ఇది సహజమే. నాయకులు కూడా  ముందు అధికారంలోకి వస్తే చాలు.. ఆ తర్వాత సంగతి చూద్దాం అన్నట్టుగా వరాలు కురిపించేస్తారు. కానీ ఏపీ సీఎం జగన్ మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరించారు. నిన్న మేనిఫెస్టో ప్రకటించిన ఆయన కొత్త పథకాలకు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వలేదు. ఉన్న పథకాలనే కొనసాగిస్తానన్నారు. కొన్ని పథకాలకు మాత్రం కొన్ని పెంపులు ఇచ్చారు.

రైతులకు రూ.16వేలు, పెన్షన్‌ 2028నాటికి 3250.. 2029 నాటికి 3500, అమ్మవడి రూ. 2000 పెంపు వంటి కొన్ని వరాలే ఇచ్చాడు జగన్. ఇదే సమయంలో ఇప్పటికే ఆరు గ్యారంటీలను చెప్పిన చంద్రబాబు.. రైతులకు రూ. 20 వేలు ఇస్తానంటున్నాడు. పెన్షన్‌ ఏకంగా రూ. 4000 ఇస్తానంటున్నాడు.. అది కూడా ఏప్రిల్‌ నుంచే అమలు చేస్తానంటున్నాడు. ఇక అమ్మవడి ఇంట్లో ఎంత మంది పిల్లలు ఉంటే అంతమందికీ ఇస్తానంటున్నాడు. ఇవికాకుండా మహిళలకు ఉచిత ప్రయాణం అంటూ ఊరిస్తున్నాడు.

చంద్రబాబు ముందే సూపర్ సిక్స్ అని ప్రకటించినా.. జగన్ మాత్రం టెంప్ట్ కాలేదు. మాటలు చెప్పి ఇ‌వ్వకుండా ఉండటం కంటే చేయగలిగేదే చెప్పాలన్న జగన్‌ నిజాయితీని మెచ్చుకోవచ్చు. ఇప్పటికే సంక్షేమ పథకాల భారం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని కుంగదీస్తోందన్న స్పృహ ఉండి ఉండొచ్చు. కానీ ప్రత్యర్థి చెలరేగిపోతున్నప్పుడు కనీసం ఆ స్థాయిలోనైనా పథకాల ప్రకటన ఉండాలి కదా అని సొంత పార్టీ నేతలే భావిస్తున్నారు.

ఇది ఒకరకంగా జగన్‌కు సాహసమే అని చెప్పాలి. తాను చెబితే ఇస్తాడన్న నమ్మకం ఉందని.. చంద్రబాబుపై ప్రజలకు నమ్మకం లేదని జగన్‌ భావిస్తుండవచ్చు. మరి ప్రజలు ఎలా స్పందిస్తారో చూడాలి. జగన్ అందిస్తున్న పథకాల కంటే ఎక్కువే ఇస్తానంటున్న చంద్రబాబును నమ్ముతారా.. లేక.. చెప్పింది ఇస్తాడని జగన్‌ వెనుకే నిలుస్తారా అన్నది వేచి చూడాలి. ఏదేమైనా జగన్‌ ఏకంగా ప్రజల నిజాయితే పరీక్ష పెట్టారేమో అనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: