ఉద్యోగుల ఓట్లు ఎవ‌రికి ప‌డ్డాయ్‌... ఏపీలో మారిన టాక్ ఇదే..!

RAMAKRISHNA S.S.
ఎన్నిక‌ల వేళ ఏపీ అధికార పార్టీ వైసీపీపై ఉద్యోగులు ఆగ్ర‌హంతో ఉన్నార‌ని ఓ సెక్ష‌న్ రాజ‌కీయ నేత‌లు చెబుతున్నారు. వారికి జీతాలు స‌రిగా ఇవ్వ‌క‌పోవ‌డం.. పీఆర్సీ ప్ర‌క‌ట‌న లేక‌పోవ‌డం.. సీపీఎస్ ర‌ద్దు చేస్తామ‌ని చెప్పి కూడా చేయ‌క‌పోవ‌డం వంటివి వైసీపీకి ఇబ్బందిగా మారాయి. ఇలాంటి స‌మ‌యంలో ప్ర‌స్తుతం జ‌రుగుతున్న పోస్ట‌ల్ బ్యాలెట్‌(ఉద్యోగుల‌కు ఇచ్చేది)లో ఉద్యోగులు స‌ర్కారుకు వ్య‌తిర‌కంగా ఓటెత్తుతున్నార‌ని, ఇది కూట‌మి దిశ‌గా లాభం చేకూరుస్తుంద‌ని కూట‌మి పార్టీల నాయ‌కులు అంచ‌నా వేస్తున్నారు.

రికార్డు స్థాయిలో పోస్ట‌ల్ బ్యాలెట్ న‌మోదు కావ‌డం కూడా.. దీనికి సంకేతాలేన‌ని ప‌రిశీల‌కులు చెబుతున్నా రు. ఈ నేప‌థ్యంలో వైసీపీ నాయ‌కులు ఉద్యోగుల‌ను ప్ర‌సన్నం చేసుకునేందుకు ప్ర‌య‌త్నాలు చేప‌ట్టారు. దీనిలో భాగంగా ఉమ్మ‌డి ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలోని తాడేప‌ల్లిగూడెం నియోజ‌క‌వ‌ర్గం నుంచి బ‌రిలో ఉన్న మంత్రి కొట్టు స‌త్య‌నారాయ‌ణ కూడా ఉద్యోగుల ను ప్ర‌స‌న్నం చేసుకునే ప్ర‌య‌త్నాలు చేశారు. తాడేప‌ల్లి గూడెంలో పోస్ట‌ల్ బ్యాలెట్ పోలింగ్ జ‌రుగుతున్న ప్రాంతానికి మంత్రి వెళ్లారు.

ఇక్క‌డ ఉద్యోగుల‌కు ఆయ‌న ఏదో చెప్పాల‌ని అనుకున్నారు. కానీ, మంత్రిని చూడ‌గానే ఉద్యోగులు తీవ్ర‌స్థాయిలో ఫైర‌య్యారు. పోలింగ్ జ‌రుగుతున్న‌ప్పుడు ఇక్క‌డ మీకేం ప‌ని అంటూ వారు ఆయ‌న‌ను ప్ర‌శ్నించారు. ఇది బెడిసి కొట్టింది. ఇక‌, నెల్లూరు, చంద్ర‌గిరిలోనూ.. వైసీపీ నాయ‌కులు ఓట్లు కొనుగోలు చేసేందుకు ప్ర‌య‌త్నించినా ఫ‌లించ‌లేదు. దీంతో ఉద్యోగులు క‌సిగా ఓటేశార‌ని టీడీపీనేత‌లు చెబుతున్నారు. మొత్తం 4 ల‌క్ష‌ల 32 వేల ఓట్లు ఉద్యోగుల‌కు ఉన్నాయి.

వీటిలో ఇప్ప‌టి వ‌ర‌కు 4 ల‌క్ష‌ల 22 వేల పైచిలుకు ఓట్లు పోల‌య్యాయి. ఇలా ఎప్పుడూ రికార్డు స్థాయిలో పోలింగ్ జ‌ర‌గ‌లేదు. దీనిని బ‌ట్టి.. ఈ ఓట్ల‌న్నీ టీడీపీకే అనుకూలంగా ప‌డ్డాయ‌ని ఆ పార్టీ నాయ‌కులు చెబుతున్నారు. ఇక‌, దీనిపై వైసీపీ నాయ‌కులు మాత్రం మౌనంగా ఉన్నారు.  మొత్తానికి ఉద్యోగుల సెగ అయితే.. వైసీపీ ఎక్కువ‌గానే ఉంద‌ని ప‌లువురు చెబుతున్నారు. వారికి ఎదురైన ప‌రాభ‌వాలు.. ఇత‌ర‌త్రా స‌మ‌స్య‌లు ఇప్పుడు వైసీపీకి మైన‌స్‌గా మారాయ‌ని అంటున్నారు. మ‌రి తీర్పు ఎలా ఉంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: