నాకు బ్రతకాలని ఉంది... వాడు బ్రతకనివ్వట్లేదు... వెలుగులోకి ఆత్మహత్యకు ముందు యువతి రాసిన లేఖ...?

Reddy P Rajasekhar

ఈ మధ్యకాలంలో కొందరు యువకుల వేధింపుల కారణంగా అమాయకురాళ్లైన యువతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఒక యువకుడి వేధింపులు భరించలేక యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన తూర్పు గోదావరి జిల్లా సఖినేటిపల్లిలో చోటు చేసుకుంది. సఖినేటిపల్లిలోని ఒక గ్రామానికి చెందిన యువతి ఈ నెల 12వ తేదీన ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు మొదట అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. 
 
యువతి కుటుంబసభ్యులకు ఇంట్లో నిన్న ఒక లేఖ లభించడంతో యువతి ఒక యువకుడి వేధింపుల కారణంగా ఆత్మహత్యకు పాల్పడినట్టు వెలుగులోకి వచ్చింది. చనిపోయే ముందు యువతి తన తల్లికి రాసిన లేఖలో " అమ్మా...! నేను ఏ తప్పు చేయలేదు... నేను చేయని తప్పుకు నేను బలి అయిపోయాను... అమ్మా నేను తీసుకున్న నిర్ణయం తప్పు అని నాకు తెలుసు.. కానీ తప్పట్లేదు.. నాకు బ్రతకాలని ఉంది కానీ వాడు బ్రతకనివ్వట్లేదు... వాడు నా ఫోటోలు తీసి బయటపెడతానని బెదిరిస్తున్నాడు. ఆ ఫోటోలు బయటపడకపోతేనే నా ఆత్మకు శాంతి చేకూరుతుంది... ఐ లవ్ యూ అమ్మా... ఐ మిస్ యూ అమ్మా.." అంటూ యువతి రాసిన లేఖ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 
 
యువతి మృతితో ఇప్పటికే శోకసంద్రంలో మునిగిపోయిన తల్లిదండ్రులు ఈ ఘటనకు బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు. పోలీసులు యువతి కాల్ డేటా ఆధారంగా విచారణ జరుపుతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటివరకు వేధింపులకు పాల్పడిన యువకుడు ఎవరనే విషయం పోలీసులకు తెలియలేదు. అన్ని కోణాల్లోను దర్యాప్తు చేస్తున్నామని త్వరలోనే నిందితుడిని పట్టుకుంటామని పోలీసులు చెబుతున్నారు. యువతులు, మహిళలు ఎవరైనా వేధింపులకు పాల్పడితే తల్లిదండ్రులకు ఆ విషయాన్ని చెప్పి లేదా పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేసి సమస్యను పరిష్కరించుకోవాలని ఎంత పెద్ద సమస్య వచ్చినా సమస్యకు ఆత్మహత్య పరిష్కారం కాదని పోలీసులు సూచిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: