మేడారంలో ప్ర‌తి యేటా ట‌న్నుల కొద్ది బంగారం... ఈ ర‌హ‌స్యం తెలుసుకోవాల్సిందే..!

Edari Rama Krishna

మేడారం జాతరకు వెళ్లిన భక్తులు మొక్కులు చెల్లించుకుంటారు. తమ ఎత్తు బంగారాన్ని(బెల్లం) సమ్మక్క,సారలమ్మకు సమర్పించుకుంటారు.  చిన్నా పెద్దా అనే తేడా లేదు.. జాతీ, కుల అనే భేదాలు లేవు.. ఎవ్వరైనా అమ్మవారికి నిలువెత్తు బంగారం సమర్పించుకొని అమ్మవారి ఆశీర్వాదం తీసుకుంటారు. ఇప్పటికే మేడారం జనసంద్రమైంది.. వేలు, లక్షలు కాదు.. కోటానుకోట్ల భక్త జనం మేడారంవైపు సాగుతున్నారు. జంపన్న వాగులో జలకాలాడి కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారం.. సమ్మక్క సారాలమ్మ కళ్లారా దర్శించుకునేందుకు భక్త జనం బారులు తీరుతున్నారు. కుంభమేళా తర్వాత దేశంలో జరిగే అతి పెద్ద జాతర ఇదే. ప్రస్తుత ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం గ్రామంలో కన్నుల పండువగా జరిగే ఈ గిరిజనుల వేడుక వెనుక చెప్పుకోదగ్గ విశేషాలు చాలానే ఉన్నాయి.

 

ముఖ్యంగా సమ్మక్క-సారలమ్మ జాతరలో బెల్లానికి ఎంతో ప్రాశస్త్యం ఉంది.  బెల్లం అంటే బంగారం అని భక్తులు భావిస్తారు. మేడారం జాతర.. ఆదివాసీల సంస్కృతి, సంప్రదాయాలతో జరిగే ప్రకృతి దేవతల జాతర... కోట్లాది భక్తుల విశ్వాసానికి వేదిక. గద్దెలపై కంక మొదళ్లతో దర్శనమిచ్చే వనదేవతలను స్మరిస్తే చాలు కోరిన కోర్కెలు తీరతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. బెల్లాన్ని బంగారంగా తల్లులకు సమర్పిస్తారు భక్తజనం. ఇది అత్యంత ముఖ్యమైన మొక్కు. ఇంకా ఒడి బియ్యం, ఎదురుకోళ్లు వంటి మొక్కులు కూడా ఉన్నాయి. ప్రతి దానికీ ఓ ప్రత్యేకత ఉంది. ఇక్క‌డ బెల్లమే బంగారం... మేడారంలో అతి ముఖ్యమైన మొక్కు బెల్లం సమర్పణ. తల్లులకు ప్రీతికరమైన బెల్లాన్ని బంగారంగా భావిస్తూ సమర్పించే సంప్రదాయం ఇక్కడే ఉంది. కోరిన కోర్కెలు నెరవేరగానే నిలువెత్తు బంగారంతో తమ మొక్కులు చెల్లిస్తారు. ఇలా గద్దెల వద్ద వేల టన్నులకొద్దీ బంగారం పోగవుతుంది.

 

గిరిజన సంస్కృతి, సాంప్రదాయ పద్దతిలో జరిగే మేడారం జాతరకు, బెల్లానికి సంబంధం ఏమిటి.? మేడారంలో బెల్లాన్ని ‘బంగారం’ అని ఎందుకంటారు.? దాన్ని నైవేద్యంగా ఎందుకు సమార్పిస్తారు.? తల్లుల గద్దెల వద్ద నుంచి చిటికెడు బెల్లం తీసుకెళ్లినా ఎందుకు తాపత్రయ పడుతారో అంటే ఇక్కడ బెల్లమే ఆ తల్లుల దీవెన.. ఆ తల్లుల వరంగా భావిస్తారు. కతీయుల కాలం నుంచే ఇది జరుగుతోంది. పూర్వం సుదూరాల నుంచి మైళ్లకొద్ది ప్రయాణించి తల్లుల దరికి చేరుకునేవారు భక్తులు. మేడారానికి చేరుకొని దాదాపు వారంరోజులు గడిపేవారు. ఈ క్రమంలో ఆకలైనప్పుడు త్వరితశక్తి(ఇన్‌స్టాంట్‌ ఎనర్జీ)ని అందించే స్వభావం కలిగిన బెల్లం పానకంతో తయారుచేసే ఆహారపదార్ధాలను తినేవారు. బెల్లం పానకంలో పల్లిగింజలు, పుట్నాలు వేసి తయారుచేసే ముద్దలను ఇష్టంగా తినేవారు. అప్పటి నుంచి బెల్లం ప్రాశస్త్యం బాగా పెరిగిపోయి.. మొక్కుబడులుగా మారాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: