జేసీ బ్రదర్స్ కు వరుస దెబ్బలు..!

NAGARJUNA NAKKA

సీఎం మా వాడు అంటూనే  విమర్శలు గుప్పిస్తున్న జేసీ బ్రదర్స్ తగిన మూల్యం చెల్లించుకుంటున్నారా...? అరేయ్ తురేయ్ అన్నందుకు జగన్ తగిన రీతిలోనే జవాబు ఇస్తున్నారా..? ప్రస్తుత పరిణామాలు చూస్తే అవుననేననిపిస్తోంది. ఒకప్పుడు జిల్లానే శాసించిన జేసీ చివరకు పోలీస్ స్టేషన్ మెట్లు కూడా ఎక్కాల్సి వచ్చింది. ఇక దివాకర్ ట్రావెల్స్ విషయంలో తగులుతున్న దెబ్బలు మామూలుగా లేవు. వరుసగా జరుగుతున్న పరిణామాల నుంచి కోలుకోకముందే... త్రిశూల్ సిమెంట్స్ లీజులను రద్దు చేస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. గత కొన్ని రోజులుగా జేసీ బ్రదర్స్ ఎదుర్కొంటున్నారు. 

 

జేసీ బ్రదర్స్.. పెద్దగా పరిచయం అక్కర్లేని సోదరులు. నాలుగున్నర దశాబ్ధాలుగా రాష్ట్ర రాజకీయాల్లో తమదైన ముద్ర వేసుకున్నారు.  ముక్కు సూటిగా మాట్లాడటం, ఎదుటి వారిపై పదునైన సెటైర్లు పేల్చడం, ముఖ్యమంత్రుల నిర్ణయాలను తప్పుబట్టడం, ఇలా వారు ఏం చేసినా కాంట్రవర్సీగానే ఉండేది. అనంతపురం జిల్లాలో బలమైన కంచుకోటను నిర్మించుకున్న జేసీ బ్రదర్స్....మొన్నటి ఎన్నికల్లో ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకుని తమ వారసులను రంగంలోకి దింపారు. తమకు ఎదురే లేదనుకునే జెసీ సోదరులు..పుత్రరత్నాల పరాజయంతో ఓటమి ఎలా ఉంటుందో తొలిసారి రుచి చూశారు. అప్పటి నుంచి జేసీ బ్రదర్స్‌కు కష్టాలు మొదలయ్యాయి. ప్రభుత్వం నుంచి దెబ్బ మీద దెబ్బలు తగులుతున్నాయి.  జేసీ దివాకర్ ట్రావెల్స్ బస్సులు వరుసగా సీజ్ అవుతున్నాయి. కోర్టు నుంచి అనుమతులు తెచుకున్నా...ఆ బస్సులు మళ్లీ రోడ్డుపైకి వస్తే సీజ్ కావడం జరుగుతోంది. 

 

ఇటీవల పోలీసులపై జేసీ చేసిన వ్యాఖ్యలు ఆయనకు శాపమై చుట్టుకున్నాయి. అనంతపురం రూరల్ పోలీస్ స్టేషన్ లో జేసీపై కేసులు నమోదు అయ్యాయి. ఈ కేసుకు సంబంధించి జేసీ కోర్టును ఆశ్రయించి కండీషన్ బెయిల్ తెచ్చుకుని... రూరల్ పోలీస్ స్టేషన్ లో సరెండర్ అయిన పరిస్థితి నెలకొంది. బెయిల్ పేపర్ల పరిశీలన పేరుతో దాదాపు 8గంటల పాటు స్టేషన్ లో కూర్చోపెట్టారు. ఇది జేసీ జీవితంలోనే ఒక బ్యాడ్ డేగా మిగిలిపోయింది. ఇప్పుడు తాజాగా మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రభుత్వం త్రిశూల్ సిమెంట్స్ లీజులను రద్దు చేస్తూ జీవో విడుదల చేయడంతో ... ఈ పరిణామాన్ని ఊహించని జేసీ బ్రదర్స్ షాక్‌కు గురయ్యారు.

 

యాడికి ప్రాంతంలో సిమెంట్ ఫ్యాక్టరీ స్థాపిస్తామని బినామీ పేర్లతో లీజు తీసుకుని నాలుగేళ్ల పాటు మైనింగ్ సాగించారని... వందల కోట్ల విలువ చేసే లైమ్ స్టోన్ దోపిడీ చేశారని పదేళ్ల క్రితం అప్పటి ఉమ్మడి హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. అయితే నాడు విచారణ నెమ్మదిగా సాగింది. వైసీపీ అధికారంలోకి వచ్చాక కేసు విచారణ వేగవంతమైంది. గత రెండు నెలల్లోనే నాలుగుసార్లు త్రిశూల్ సిమెంట్స్ వ్యవహారంపై కోర్టులో విచారణ జరిగింది. ఈ కేసులో జేసీ కుటుంబసభ్యులకు నోటీసులు కూడా జారీ చేసింది. యాడికిలోని కొనుప్పలపాడులో 649 హెక్టార్ల పరిధిలోని సున్నపు రాతి గనులు లీజుకు తీసుకున్నారు. అయితే సకాలంలో పనులు ప్రారంభం కాకపోవడంతో లీజు రద్దు చేస్తూ ప్రభుత్వం  ఉత్తర్వులు జారీ చేసింది. సిమెంట్ తయారీ ప్లాంట్ నిర్మాణానికి మరో ఐదేళ్లు పొడిగింపు ఇస్తూ గతంలో జారీ చేసిన ఉత్తర్వుల్ని కూడా ప్రభుత్వం వెనక్కు తీసుకుంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: