తిరుమలలో హరీష్ కు చేదు అనుభవం ... ఆలయాలకు పోటెత్తిన భక్తులు

B Sridhar Yadav

తెలంగాణ ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీష్ రావుకు తిరుమలలో చేదు అనుభవం ఎదురయింది . వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని తిరుమలేశుని దర్శించుకుందామని తిరుమలకు వెళ్లిన హరీష్ కు ఆలయ వర్గాలు కనీస ప్రోటోకాల్ పాటించలేదని తెలుస్తోంది . దాంతో టీటీడీ ఆలయ వర్గాల తీరుపై మంత్రి అసహనం వ్యక్తం చేస్తూ , దర్శనానికి వెళ్లేందుకే ఒక దశలో నిరాకరించారని సమాచారం .

 

అయితే ఆలయ పాలకవర్గ సభ్యుడు ఒకరు కలుగజేసుకుని జరిగిన పొరపాటుకు చింతిస్తున్నట్లు , మంత్రికి సర్ది చెప్పడంతో , హరీష్ వైకుంఠ ద్వారం ద్వారా దేవదేవున్ని దర్శించుకున్నారు . ఇక వైకుంఠ ఏకాదశి రోజున ఆ శ్రీనివాసుని దర్శించుకునేందుకు వి విఐపి లు తిరుమలకు క్యూ కట్టారు . కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తో పాటు , ఆంధ్ర ప్రదేశ్ , తెలంగాణ రాష్ట్రాలకు చెందిన మంత్రులు  పెద్దిరెడ్డి , అనిల్ కుమార్ యాదవ్ , విశ్వరూప్ , వెల్లంపల్లి శ్రీనివాస్ , మేకపాటి గౌతమ్ రెడ్డి , బాలినేని శ్రీనివాస్ రెడ్డి , పుష్ప శ్రీవాణి , నారాయణస్వామి, రంగరాజు , ఇక తెలంగాణ కు చెందిన మంత్రులు హరీష్ తో పాటు కేటీఆర్ , తలసాని శ్రీనివాస్ యాదవ్ , మల్లారెడ్డి , శ్రీనివాస్ గౌడ్ తో పాటు పలువురు ఉన్నారు .

 

వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని టీటీడీ 4 , 004 పాసులు జారీ చేసింది . వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని వైష్ణవాలయాలన్ని భక్తులతో కిటకిటలాడుతున్నాయి . వైకుంఠ ద్వారం నుంచి స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు కిమీ కొద్ది క్యూలైన్లలో వేచి ఉన్నారు . తెలంగాణలోని ప్రముఖ పుణ్య క్షేత్రాల్లోను భక్తుల సందడి తీవ్రంగా కన్పిస్తోంది . నగర శివారు చిలుకూరు బాలాజీ దేవాలయానికి కూడా భక్తులు పోటెత్తారు . 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: