ఢిల్లీలో దారుణం...530 విమానాలు నిలిచిపోయి.. ఆరుగురి ప్రాణాలు గాలిలో క‌లిసి...

Pradhyumna

చలి ఉగ్ర‌రూపానికి దేశ రాజ‌ధాని ఢిల్లీ వ‌ణికిపోతోంది. ఢిల్లీలో ఇవాళ దట్టమైన పొగమంచు కమ్మేసింది.  మధ్యాహ్నం వంటి గంట వరకు పరిస్థితి ఇలాగే ఉందంటే...తీవ్ర‌త‌ను అర్థం చేసుకోవ‌చ్చు.  నగరంలో ఉష్ణోగ్రతలు 2.6 నుంచి 2.8 డిగ్రీల సెల్సియస్‌గా నమోదు అయ్యాయి. షిమ్లా కన్నా తక్కువ ఉష్ణోగ్రతలు నమోదు కావడం విశేషం. గ్రేటర్‌ నోయిడాలో పొగమంచు కారణంగా కారు ప్రమాదం జరిగింది. ఈ ప్ర‌మాదంలో ఆరుగురు మృతిచెందారు. మ‌రోవైపు,  దీంతో సుమారు 530 విమాన రాకపోకలు ఆలస్యం అయ్యాయి.సుమారు 30 రైళ్లు కూడా ఆలస్యంగా నడుస్తున్నట్లు అధికారులు చెప్పారు.

 

దారుణ‌మైన పొగమంచు కారణంగా ఉత్తరప్రదేశ్ లోని  గ్రేటర్ నోయిడాలో ఓ కారు అదుపు తప్పి కాల్వలో పడిపోయింది. ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులతో పాటు మొత్తం ఆరుగురు చనిపోయారు. మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి.   సంబర్ జిల్లా నుంచి  ఢిల్లీకి వెళ్తుండగా ఆదివారం రాత్రి 11.30 గంటలకు దంకౌర్ ప్రాంతం వద్ద కారు ఖేర్లీ కాలువలో పడింది.  మారుతి ఎర్టిగాలో మొత్తం 11 మంది ఉన్నారు. ఘటన స్థలానికి వచ్చిన పోలీసులు వారిని ఆస్పత్రికి తరలించగా అక్కడ ఆరుగురు చనిపోగా  ఐదుగురు చికిత్స పొందుతున్నారని చెప్పారు. మృతులు మహేష్ (35), కిషన్లాల్ (50), నీరేష్ (17), రామ్ ఖిలాడి (75), మల్లు (12), నేత్రపాల్ (40) గా గుర్తించారు. 

 

ఢిల్లీ స‌హా ప‌రిస‌ర ప్రాంతాల్లో విపరీతంగా పొగమంచు కమ్ముకోవడంతో విమానాల రాకపోకలకు తీవ్ర ప్రభావం చూపుతోంది. దీంతో పాటుగా ఉత్తర రైల్వే పరిధిలో 30 రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఇటు విమానాలు, అటు రైళ్లు ర‌ద్దు అవ‌డం, ఆల‌స్యంగా న‌డుస్తుండ‌టంతో జనాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ప్రయాణీకులు ఎటూ పాలుపోక గంటల తరబడి వేచి చూస్తున్నారు. ఢిల్లీతో పాటు ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, జమ్మూ కశ్మీర్ లో కూడా చలి తీవ్రంగా ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: