అమరావతి : మీడియాపై దాడులు.. ఆ కుట్రలో భాగమేనా..?
అమరావతిపై కేబినెట్ మీటింగ్ జరుగుతున్న సమయంలోనే కొందరు మీడియా ప్రతినిధులపై దాడులు కలకలం రేపుతున్నాయి. ఇదంతా పక్కా ప్లాన్ ప్రకారమే జరుగుతోందన్న వాదనలు వినిపిస్తున్నాయి. మంత్రివర్గ నిర్ణయాలు అధికారికంగా ప్రకటించక ముందే కొన్ని రాజదాని గ్రామాలలో కొందరు దౌర్జన్యానికి పాల్పడుతున్న దృశ్యాలు టీవీల్లో వచ్చేశాయి. కొందరు ప్రశాంతంగా తమ నిరసనలు తెలుపుతుండగా, మరికొందరు మాత్రం వాహనాలపై కర్రలతో దాడులు చేశారు. ఒక కారులో వెళుతున్న జర్నలిస్టులపై కర్రలతో దాడి చేశారు. దాంతో కారు అద్దాలు పగిలాయి.
ఈ దాడిలో ఒక మహిళా జర్నలిస్టు గాయానికి గురయ్యారు. అయితే కేవలం శాంతిభద్రతల సమస్య సృష్టించడానికి కొంతమంది కుట్ర పన్నారని పోలీసులు బావిస్తున్నారు. ఉద్దండరాయపాలెం వద్ద బిజెపి అద్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ దీక్ష జరుగుతున్న చోట ఈ దాడి జరిగింది. రైతుల ముసుగులో జర్నలిస్టులపై దాది చేశారన్న వాదన వినిపిస్తోంది. కొన్ని ఇతర వాహనాలపై కూడా కొందరు దాడి చేసినట్లు వార్తలు వచ్చాయి. మహిళా జర్నలిస్టు అని కూడా చూడకుండా దారుణంగా ప్రవర్తించారని అంటున్నారు.
అయితే.. మీడియా ప్రతినిధులపై దాడి చేయడం దారుణమని, రైతుల ముసుగులో ఉన్న టీడీపీ వారే దాడి చేశారని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ నందిగం సురేష్ అన్నారు. ఉద్దండరాయునిపాలెం వద్ద బీజేపీ నేత కన్నాలక్ష్మీనారాయణ చేస్తున్న నిరసనను కవర్ చేయడానికి వెళ్లిన మీడియా సోదరులపై జరిగిన దాడిని ఎంపీ తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సమస్య ఉంటే నిరసన తెలియజేయాలి.. పోలీస్ వ్యవస్థ కూడా పర్మిషన్ ఇచ్చింది.. నిరసన రూపంలో ఏదైనా తెలియజేయాలని కానీ, దాడులకు తెగబడడం మంచిపద్ధతి కాదన్నారు.
నాయకులు, ప్రజల ప్రతికష్టాన్ని ప్రపంచానికి చూపించే మీడియా సోదరులు మాత్రమేనని, అలాంటి వారిపై దాడి చేయడం బాధాకరమన్నారు. టీడీపీ వారే కొంతమంది మీడియా సోదరులపై దాడి చేశారని, రైతులకు దాడి చేసే ఉద్దేశం ఉండదన్నారు. ఇలాంటి సంఘటనలు జరగకుండా పోలీస్ వ్యవస్థ గట్టి చర్యలు తీసుకోవాలని కోరారు.