కేసీయార్, మోడీ అంటావ్.. జగన్ ఏం చేశాడు పవన్...!?

Satya
పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పెట్టిన కొత్తల్లో ఓ మాట తరచూ చెప్పేవారు. అదేంటి అంటే కొత్తరకం రాజకీయం చేద్దాం. వ్యక్తులు ముఖ్యం కాదు, మనకు ప్రజలు ముఖ్యం. వాటికంటే రాజకీయాలు కానే కాదు. నేను ఎవరినీ ఉత్త పుణ్యానికి విమర్శించను, ఎవరిపైనా ద్వేషం పెచుకోను. ఇలా చాలా నీతి మాటలే చెప్పారు. మరి పవన్ వాటిని ఆచరిస్తున్నారా. రాజకీయాలు భ్రష్టు పట్టిపోయాయి అంటున్న పవన్ తాను అందులో ముక్కలా ఎందుకు ఇరుక్కుపోయారు. చంద్రబాబు కాలం నాటి పాలిటిక్స్ నే పవన్ ఎందుకు చేయాలి. బాబుది 70 దశకం నాటి పాలిటిక్స్. మరి పవన్ కొత్త రాజకీయం ఏమైంది.


తెలంగాణా ఆర్టీసీ కార్మికుల సమస్య విషయంలో కేసీయార్ ని కలుస్తానని పవన్ చెప్పారు. అక్కడ కార్మికులు వినతిపత్రం ఇవ్వగానే పవన్ వెంటనే లాంగ్ మార్చ్ అని  అక్కడ ఏం చేయలేదుగా. నిజానికి భవన నిర్మాణ కార్మికులతో పాటుగా అర్టీసీ సమ్మె కూడా పెద్దదే. ఈ రోజుకీ జీతాలు వారికి లేవు. మరి పవన్ మర్యాదగా ప్రతిపక్ష బాధ్యతలు అక్కడ గుర్తెరిగి మరీ ముందు కేసీయార్ తో మాట్లాడుతాను అన్నారు. అంటే మాటలతో కుదరకపోతే ఆందోళన చేయాలని కదా అర్ధం. 


ఇక ఏపీ విషయంలో తీసుకుంటే చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా పవన్ ఎపుడు ఏ సమస్య వచ్చినా ముందు ముఖ్యమంత్రి బాబుని కలిసేవారు. ఆయనతో మాట్లాడుతాను, అప్పటికీ కాకపోతే అపుడు ఆందోళన చేద్దాం అనేవారు. మరి ఆ నీతి, రీతి జగన్ విషయంలో పవన్ కి ఏమైపోయాయో కదా. నిజానికి జగన్ ముఖ్యమంత్రి అయ్యాక పవన్ ఎపుడైనా ఆయన్ని కలిసారా. మెగాస్టార్ చిరంజీవి ఇటీవల కలసి వచ్చారు. మర్యాద చాటుకున్నారు. మరి పవన్ ఎందుకు కలవరు, పైగా రాజకీయ పార్టీ, ప్రజల కోసం అంటున్న పవన్ మాటల్లో చిత్త శుద్ధి ఎంత ఉంది.


రాజధాని  మార్పు విషయంలో కూడా అమరావతిలో పర్యటించిన పవన్ ఈ విషయంలో ప్రధాని తో మాట్లాడుతా, అమిత్ షాని కలుస్తా అన్నారు. అంటే ఏపీ సీఎం జగన్ని అవమానించినట్లే కదా. ముందు ఏపీ రాజకీయాల్లో ముఖ్యమంత్రిని కలవాలి, ఆయన కాదూ కూడదు అంటే అపుడు ఇతర మార్గాలు ఎంచుకునే స్వేచ్చ హక్కూ పవన్ కి ఎపుడూ ఉన్నాయి. కానీ తెలుగింటి రాజకీయాలను ఢిల్లీకి వెళ్ళి రచ్చ చేస్తాను అంటున్నారే తప్ప ఏపీ సీఎంతో మాట్లాడననే కదా. 


తాజాగా లాంగ్ మార్చ్ పవన్ చేపట్టారు. భవన నిర్మాణ కార్మిక నేత అదే వేదిక మీద చెప్పిన మాటలే వింటే గత నెల 24న పవన్ని మంగళగిరి ఆఫీస్ లో  కలసి వినతిపత్రం ఇచ్చారు. నిజమే ప్రతిపక్ష పార్టీగా ఇచ్చారు. దాని మీద పవన్ ఏం చెప్పాలి, ముందు సీఎంతో మాట్లాడుదాం, అపుడు కుదరకపోతే ఆందోళన చేద్దామనే కదా. కానీ పవన్ వెంటనే లాంగ్ మార్చ్ అనేశారు. ఇదే విషయాన్ని ఆ భవన నిర్మాణ సంఘ నాయకుడు వేదిక మీద చెబుతూ వెంటనే పవన్ నిర్ణయం తీసుకున్నారని ధన్యవాదాలు తెలిపారు. 


అంటే ఇక్కడ అర్ధమవుతోంది ఏంటీ అంటే ఒక ప్రజా  సమస్య దొరికితే రాజకీయం చేసి  రోడ్లు ఎక్కాలనే కదా. పవన్ ఈ విషయంలో ప్రధాని మోడీని కలుస్తామని అంటున్నారు. కలిస్తే ఏమవుతుంది. ప్రధాని మాత్రం ఏం చేయగలరు, ఎక్కడ సమస్య అక్కడే పరిష్కరించుకోవాలి కదా.  మరి పవన్ కి జగన్ని కలవడానిక్ ఏ ఇగో అడ్డు వస్తోందో, లేక ఏ రాజకీయ ప్రయోజనం అడ్డుపడుతోందో అని ఒక్కటే సెటైర్లు సొషల్ మీడియాలో  పడుతున్నాయి. మొత్తానికి పవన్ కూడా పాత రాజకీయమే చేస్తున్నారు అంతే


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: