మోడీ ముందు జగన్ కోరికల చిట్టా.. ఇదేనా..?

Chakravarthi Kalyan

ప్రధానమంత్రి మోడీని ఏపీ సీఎం జగన్ కలిశారు. అసలే రాష్ట్రం అప్పుల్లో ఉంది. దీనికి తోడు.. ఎన్నికల ముందు జగన్ ప్రజలకు ఇచ్చిన నవరత్నాల హామీలు ఉన్నాయి. వాటి అమలుకు వేల కోట్లు సొమ్ము కావాలి. అందుకే జగన్ ప్రధాని మోడీ ముందు తన కోరికల చిట్టా విప్పారు. ఏపీని చల్లగా చూడాలని మోడీకి విజ్ఞప్తి చేశారు.


జగన్ ఏమన్నారంటే..." నవరత్నాలుకు చేయూతనివ్వండి.. రాష్ట్రంలోని అన్ని వర్గాల సంక్షేమం, సమగ్ర అభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రకటించిన నవరత్నాలు పథకాలు రాష్ట్రంలో ఒక కొత్త శకానికి నాంది పలుకుతున్నాయి.. రైతుల కోసం రైతు భరోసా ఇస్తున్నాం.. అందరికీ విద్యనందించేందుకు అమ్మ ఒడి, విద్యా దీవెన ప్రవేశపెడుతున్నాం. అందరికీ ఆరోగ్యం కోసం ఆరోగ్యశ్రీ ఇస్తున్నాం.. నిరుపేదలకు గూడు కోసం పేదలందరికీ ఇళ్లు... ఈ ఏడాదే ఇళ్ల స్థలాల పంపిణీ చేస్తున్నాం..


“ సామాజిక భద్రత కోసం– పింఛన్లు పెంచాం. మహిళా సాధికారత కోసం–ఆసరా అమలు చేస్తున్నాం.. నిరాదరణకు గురవుతున్న వర్గాలకు చేయూత ఇస్తున్నాం.. జలయజ్ఞం ద్వారా సాగునీటి వనరుల పెంచుతున్నాం.. ఇవన్నీ జాతీయస్థాయిలో అమలు చేయదగ్గవి కాబట్టి, రాష్ట్రంలో పైలట్‌ ప్రాజెక్టుగా చేపట్టాలని సంబంధిత మంత్రిత్వ శాఖలను ఆదేశించాలని" జగన్ మోడీని కోరారు.


దీంతో పాటు రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం ప్రాజెక్టులకు ఆర్థిక సాయం అందించాలన్నారు. ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టం ప్రకారం కడప స్టీల్‌ప్లాంట్, రామాయపట్నం పోర్టులను కేంద్రం నిర్మించాల్సి ఉందని గుర్తు చేసారు. రాష్ట్ర పారిశ్రామిక ప్రగతికి ఈ ప్రాజెక్టులు ఎంతో కీలకమైనవని... విశాఖపట్నం – చెన్నై ఇండస్ట్రియ్‌ కారిడార్, కాకినాడ పెట్రోలియం కాంప్లెక్స్‌కూ తగిన రీతిలో నిధులు కావాలని జగన్ కోరారు. సకాలంలో ఈ ప్రాజెక్టులు పూర్తయ్యేలా సంబంధిత మంత్రిత్వ శాఖలను ఆదేశించాల్సిందిగా కోరుతున్నామని ప్రధానికి విజ్ఞప్తి చేసుకున్నారు జగన్.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: