
హైదరాబాద్ వాసులను వణికించబోతున్న మరో మహమ్మారి..?
హైదరాబాద్ వాసులను వరుస కష్టాలు వణికిస్తున్నాయి. రోజూ కుమ్మేస్తున్న వర్షాలు పలు ప్రాంతాల్లో నరకం చూపించాయి. వర్షానికి రోడ్డు ఖరాబై ప్రయాణం నరక ప్రాయమవుతోంది. పలు లోతట్టు ప్రాంతాల్లో నీరు చేరింది. ఈ కష్టాలకు తోడు ఇప్పుడు కొత్త కష్టాలు రాబోతున్నాయి. తగ్గిపోయిన ఉష్ణోగ్రతలతో రోగాలు విజృంభించే అవకాశాలు పెరిగాయి.
పదేళ్ల క్రితం హైదరాబాద్ ను వణికించిన స్వైన్ ఫ్లో మళ్లీ విజృంభించేదుకు రెడీ అవుతోంది. పగటి ఉష్ణోగ్రతలు పడిపోతే హెచ్1ఎన్1 స్వైన్‌ఫ్లూ కారక వైరస్ విజృంభిస్తుంది. ఇప్పటికే ఈ ఏడాది తెలంగాణలో 1,300 పైగా కేసులు నమోదయ్యాయి. వీరిలో 21 మంది మృతి చెందారు. ఇక ఈ సీజన్ లోనూ కొన్ని కేసులు నమోదవుతున్నాయి. తాజాగా హైదరాబాద్‌లో మరో నాలుగు అనుమానిత ఫ్లూ కేసులు నమోదయ్యాయి.
తాజా కేసుల్లో ఒకరు గాంధీలో చికిత్స పొందుతున్నారు. మరో మరో ముగ్గురు ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ స్వైన్ ఫ్లో అంటు వ్యాధి.. ఒకరి నుంచి మరొకరికి సులభంగా వ్యాపిస్తుంది. ఫ్లూ సోకిన వ్యక్తి దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు వైరస్ గాలిలోకి ప్రవేశించి ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంది. ప్రత్యేకించి దీని ప్రభావం పిల్లలు, వృద్ధులు, గర్భిణులపై ఎక్కువ.
అందుకే హైదరాబాద్ వాసులు దీనిపట్ల జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. జలుబు, దగ్గు, జ్వరం, ఒళ్లునొప్పులతో బాధపడుతున్న వారు బయటకు వెళ్లకుండా ఇంట్లోనే ఉండాలంటున్నారు. అలాగే బాధితుల కోసం ప్రత్యేకంగా రుమాలు, టవల్ వంటివి ఉంచాలి. వారు దగ్గేటప్పుడు, తుమ్మేటప్పుడు కర్చీఫ్ అడ్డుపెట్టుకుని ఇంట్లో మిగిలిన వారికి సోకకుండా జాగ్రత్త పడాలి.
స్వైన్ ఫ్లూను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం తగిన చర్యలు చేపడుతోంది. రోగుల కోసం ‘ఒసల్టామీవిర్’ టాబ్లెట్స్‌ను, డబుల్ లేయర్ మాస్క్‌లను అందుబాటులో ఉంచింది. హైదరాబాద్ లోని ఉస్మానియా, గాంధీ, ఫీవర్, ఛాతి ఆస్పత్రిలతో పాటు జిల్లా, ఏరియా ఆస్పత్రులకు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్య సిబ్బందికి మాస్క్‌లను ప్రభుత్వం సరఫరా చేసింది.