లైకుల కోసం ప్రాణాలతో చెలగాటం.. బైక్ స్టంట్ ట్విస్ట్ షాకింగ్!

Amruth kumar
నేటి కాలంలో యువతకు తిండి లేకపోయినా ఉంటారు కానీ, చేతిలో ఫోన్, సోషల్ మీడియాలో రీల్స్ లేకపోతే ఉండలేకపోతున్నారు. ముఖ్యంగా బైక్ మీద విన్యాసాలు చేస్తూ, ప్రాణాలకు తెగించి వీడియోలు తీయడం ఒక ఫ్యాషన్‌గా మారింది. సరిగ్గా ఇలాంటి 'అతి' ఉత్సాహమే బీహార్‌కు చెందిన ఒక యువకుడిని చావు అంచుల్లోకి తీసుకెళ్లింది. అయితే, అక్కడ జరిగిన ట్విస్ట్ ఏంటంటే.. గాయాలతో ఆస్పత్రిలో చేరిన అతగాడికి, డిశ్చార్జ్ అవ్వకముందే పెళ్లి అయిపోయింది!బీహార్‌లోని బాంకా జిల్లాకు చెందిన ఒక యువకుడు తన బైక్‌పై రయ్ రయ్ మంటూ దూసుకెళ్తూ, మొబైల్ కెమెరాతో రీల్స్ షూట్ చేస్తున్నాడు. గాలిలో చేతులు వదలడం, ప్రమాదకరమైన మలుపులు తిప్పడం వంటి స్టంట్లు చేస్తూ ఒక్కసారిగా నియంత్రణ కోల్పోయాడు. ఫలితంగా బైక్ ఘోరంగా బోల్తా పడింది. ఒళ్లంతా గాయాలతో, కాళ్ళు విరిగి ఆ యువకుడు రక్తపు మడుగులో పడిపోయాడు. వెంటనే స్థానికులు అతడిని దగ్గరలోని హాస్పిటల్‌కు తరలించారు.



నిజానికి ఆ యువకుడికి అంతకుముందే ఒక అమ్మాయితో వివాహం నిశ్చయమైంది. మరో కొన్ని రోజుల్లో పెళ్లి జరగాల్సి ఉండగా ఈ ప్రమాదం జరిగింది. అబ్బాయి పరిస్థితి చూసి పెళ్లి ఆగిపోతుందేమో అని అందరూ భయపడ్డారు. కానీ, ఇక్కడే ఆ అమ్మాయి ధైర్యం అందరినీ ఆశ్చర్యపరిచింది. "అతను ఏ స్థితిలో ఉన్నా సరే, నేను ఇప్పుడే అతడిని పెళ్లి చేసుకుంటాను" అని ఆ వధువు పట్టుబట్టింది. కుటుంబ సభ్యులు కూడా అంగీకరించడంతో, ఆస్పత్రి వార్డులోనే పెళ్లికి ముహూర్తం పెట్టేశారు.సాధారణంగా పెళ్లి అంటే బాజాభజంత్రీలు, కల్యాణ మండపం, భారీ విందు ఉంటుంది. కానీ ఈ పెళ్లిలో మాత్రం గ్లూకోజ్ బాటిల్స్, స్టెతస్కోప్‌లు, మందుల వాసన మధ్య తంతు ముగిసింది. వరుడు కదలేని స్థితిలో బెడ్‌పై పడుకుని ఉండగా, వధువు పెళ్లి దుస్తుల్లో వచ్చి అతడి పక్కన నిలబడింది. డాక్టర్లు, నర్సుల సమక్షంలో నిరాడంబరంగా ఈ పెళ్లి జరిగింది. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.



ఈ ఘటనపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. "వధువు ప్రేమ గొప్పది" అని కొందరు మెచ్చుకుంటుంటే, మెజారిటీ జనం మాత్రం ఆ యువకుడిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. "లైకుల కోసం ప్రాణాలు పోగొట్టుకుంటే ఆ అమ్మాయి పరిస్థితి ఏంటి?" అని ప్రశ్నిస్తున్నారు. రీల్స్ పిచ్చి అనేది ఒక వ్యసనంలా మారి ప్రాణాలను బలితీసుకుంటోందని, యువత మేల్కోవాలని హెచ్చరిస్తున్నారు.ఈ బీహార్ యువకుడికి అదృష్టం బాగుండి ప్రాణాలు దక్కాయి, ఒక మంచి భార్య దొరికింది. కానీ అందరికీ ఇలాగే జరగాలని లేదు. రీల్స్ చేసేటప్పుడు కనీస జాగ్రత్తలు తీసుకోకపోతే, ఆస్పత్రి బెడ్‌పై పెళ్లి కాదు కదా.. కనీసం ప్రాణాలతో ఉండే అవకాశం కూడా ఉండదు. సోషల్ మీడియాలో పాపులారిటీ కంటే ప్రాణం మిన్న అని గుర్తుంచుకోవాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: