సిబిఐ విచారణంటే చంద్రబాబులో ఎందుకు టెన్షన్ ?
జగన్మోహన్ రెడ్డి సిఎం
అయిన తర్వాత సిబిఐకి అప్పగించిన కేసు యరపతినేని అక్రమ మైనింగ్ కేసే. రాష్ట్రంలోకి
సిబిఐ ఎంట్రీని చంద్రబాబునాయుడు అడ్డుకుంటే జగన్ మాత్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
అనేక కేసులు సిబిఐ విచారణకు అర్హమైనవిగా వైసిపి నేతలు భావిస్తున్నప్పటికి గుంటూరు
జిల్లాలోని గురజాల నియోజకవర్గంలో జరిగిన అక్రమ మైనింగ్ కేసును మాత్రమే జగన్
ప్రభుత్వం సిబిఐ విచారణకు అప్పగించింది.
చంద్రబాబు హయాంలో గురజాల ఎంఎల్ఏగా ఉన్న యరపతినేని శ్రీనివసరావు అకమ్రమ మైనింగ్ లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. అన్నీ వ్యవస్ధలను గుప్పిటలో పెట్టుకుని తన ఇష్టారాజ్యంగా అక్రమ మైనింగ్ తో భారీగా దోచేసుకున్నారు. హై కోర్టులో విచారణ జరిగినపుడు బయటపడిన అక్రమ మైనింగ్ విలువ సుమారు రూ. 400 కోట్లని తేలింది.
ఐదేళ్ళ పాటు అంత భారీ ఎత్తున అక్రమ మైనింగ్ కు పాల్పడుతుంటే మరి రెవిన్యు, మైనింగ్, పోలీసు శాఖలు ఏమి చేస్తున్నాయని హై కోర్టు అడిగిన ప్రశ్నలకు ప్రభుత్వం నుండి ఎటువంటి సమాధానం రాలేదు. దాంతో అన్నీ వ్యవస్ధలు ఫెయిలయ్యాయంటూ హై కోర్టే మండిపడింది. దాంతోనే అక్రమాలు జరిగాయని తేలింది కాబట్టి వాటి వెనుకల ఎవరున్నారనే విషయం తేలాలంటే సిబిఐ విచారణను కోరే అవకాశాన్ని హై కోర్టే ప్రభుత్వానికి సూచించింది.
ఎప్పుడైతే హై కోర్టే సూచించిందో రాష్ట్రప్రభుత్వ చకచక పావులు కదిపింది. వైసిపి నేతల ఆరోపణల ప్రకారం తెర మీద కనిపిస్తున్నది యరపతినేనే అయినప్పటికీ తెరవెనుక ఉండి మొత్తం కథను నడిపించింది చంద్రబాబు, చినబాబులే. అందుకే అక్రమంగా సంపాదించిన వందల కోట్ల రూపాయలు చంద్రబాబు, లోకేష్ జేబుల్లోకే వెళ్ళాయని వైసిపి ఆరోపిస్తోంది. కాబట్టే సిబిఐ విచారణ ఇపుడు చాలా కీలకమైంది. అంటే యరపతినేని అక్రమాలపై ప్రత్యక్షంగా సిబిఐ విచారణంటే పరోక్షంగా చంద్రబాబు, చినబాబు మీదే అనే ప్రచారం జరుగుతోంది.