యూరియా నేరుగా గ్రామాలకే.. అధికారులను ఆదేశించిన సీఎం కేసీఆర్

frame యూరియా నేరుగా గ్రామాలకే.. అధికారులను ఆదేశించిన సీఎం కేసీఆర్

NAGARJUNA NAKKA

రైతులందరికీ సరిపోయేంత యూరియాను  గ్రామాలకు సరఫరా చేయాలని ముఖ్యమంత్రి  కేసీఆర్ అధికారులను ఆదేశించారు. మూడు నాలుగు రోజుల్లోనే డిమాండ్ కు తగినంత ఎరువులను  అందచేయాలన్నారు. పోర్టుల్లో ఉన్న స్టాకును రైళ్లు, లారీల ద్వారా  స్టాకు పాయింట్లలో పెట్టకుండా నేరుగా  గ్రామాలకే పంపాలని ఆదేశించారు. 


తెలంగాణ రైతులకు ఎరువుల కొర‌త‌పై ప్రగతి భవన్ లో  సీఎం కేసీఆర్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో నెలకొన్న యూరియా డిమాండ్ పై  చర్చించారు.  ఎన్నడూ లేనంతగా యూరియా డిమాండ్ కు కారణాలను వ్యవసాయశాఖ అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. కేంద్ర ప్రభుత్వం డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ ఫర్ విధానం ద్వారా రైతులకు ఎరువులు అందివ్వాలని నిర్ణయించింద‌నీ,  దీంతో ప్రైవేటు కంపెనీలు, వ్యాపారులు ఎరువులను తెప్పించ‌లేద‌న్నారు. నాలుగు సంవత్సరాలలో ఖరీఫ్ సీజన్లో 6 లక్షల టన్నుల యూరియా డిమాండ్ ఉంద‌ని,  ఈసారి ఆగస్టు చివరి నాటికే రాష్ట్రంలో 6 లక్షల టన్నుల యూరియా రైతులకు చేరింద‌న్నారు. ఈ సారి పంటల విస్తీర్ణం పెరగడం వల్ల డిమాండ్ పెరిగింద‌న్నారు.  


ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగి తొందరగా యూరియా తెప్పించడానికి ఏర్పాట్లు చేశారు. పోర్టుల్లో ఉన్న యూరియా స్టాకును వెంటనే తెలంగాణ జిల్లాలకు తరలించాలని సూచించారు. దీని కోసం 25 ప్రత్యేక గూడ్సులను కేటాయించాలని రైల్వే అధికారులను కోరారు. జగిత్యాల, మంచిర్యాల, ఆదిలాబాద్, పెద్దపల్లి, వరంగల్, మహబూబాబాద్, కరీంనగర్, సనత్ నగర్, ఖమ్మం, కొత్తగూడెం, జడ్చర్ల, తిమ్మాపూర్  రైల్వే స్టేషన్లకు  గూడ్సుల ద్వారా యూరియా పంపాలని కోరారు. దీనికి రైల్వే అధికారులు అంగీకరించారు.  


పోర్టులలో ఉన్న యూరియాను రాష్ట్రానికి రప్పించడానికి రైళ్లతో పాటు, 3 వేల లారీలను వాడాలని సీఎం నిర్ణయించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలోని లారీలను వెంటనే పోర్టులకు పంపాలని చెప్పారు. ఎపి రవాణా శాఖ మంత్రి పేర్నినానితో ముఖ్యమంత్రి ఫోన్ లో మాట్లాడారు. వీలైనన్ని ఎక్కువ లారీలు సేకరించి,  తెలంగాణకు యూరియా పంపుతామని నాని హామీ ఇచ్చారు. మూడు నాలుగు రోజుల్లోనే దాదాపు లక్ష టన్నుల యూరియా తెలంగాణలోని అన్ని ప్రాంతాలకు అందాలని, యూరియా కోసం రైతులు ఎదురు చూసే పరిస్థితి తొలగిపోవాలని సిఎం ఆదేశించారు. యూరియాను తెలంగాణకు రప్పించే పనిని ప్రగతి భవన్ లోనే ఉండి పర్యవేక్షించాలని మంత్రులు నిరంజన్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డిలను, అధికారులను సీఎం ఆదేశించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: