మాట ఇస్తే తప్పేది లేదు.. అదిరేలా ప్లాన్ చేసిన జగన్..?

Chakravarthi Kalyan

మాట ఇస్తే తప్పేది లేదు.. అందుకే మాట తప్పను.. మడమ తిప్పను.. అన్నది వైఎస్ ఫ్యామిలీ ట్యాగ్ లైన్ అయ్యింది. ఎన్నికల ముందు ఓటర్లకు నవరత్నాల హామీలు ఇచ్చిన జగన్.. ఇప్పుడు వాటి అమలు కోసం సీరియస్ గా కసరత్తు చేస్తున్నారు. ఆయన ఆదేశాల ప్రకారం.. రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం అమలు చేయనున్న పథకాల యాక్షన్‌ ప్లాన్‌ను ప్రభుత్వం సిద్ధం చేసింది.


అన్ని జిల్లాల కలెక్టర్లకు పథకాల అమలుకు సంబంధించిన షెడ్యూల్‌ను వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సీఎం జగన్ స్వయంగా వివరించారు. షెడ్యూల్‌ ప్రకారం.. ఆగస్ట్ 15 న గ్రామ, వార్డు వలంటీర్ల వ్యవస్థను సీఎం జగన్‌ విజయవాడలో ప్రారంభిస్తారు. మిగతా అన్ని నియోజకవర్గాలు, మండలాల్లో అక్కడి ఎమ్మెల్యేలు, మండల స్థాయి అధికారులు ప్రారంభిస్తారు.


ఆగస్తు 16 నుంచి 23 వరకు ప్రతి గ్రామం, వార్డుకు కేటాయించిన ఇళ్లకు సంబంధించి వలంటీర్లకు అవగాహన కల్పిస్తారు. ఆగస్టు 26 నుంచి 30 వరకు గ్రామాల్లో ఇళ్ల పట్టాలు లేని లబ్ధిదారుల కోసం సర్వే చేస్తారు. సెప్టెంబరు 1 నుంచి సెప్టెంబరు 10 వరకూ బియ్యం, పెన్షన్లు డోర్‌ డెలివరీ చేస్తారు. పైలట్‌ ప్రాజెక్టుగా నాణ్యమైన, ప్యాకేజ్‌ చేసిన బియ్యం పంపిణీని శ్రీకాకుళంలో ప్రారంభిస్తారు. తర్వాత మిగతా జిల్లాలకు వర్తింపజేస్తారు. ఈ ఏడాది చివరి నాటికి అన్ని జిల్లాల్లో నాణ్యమైన ప్యాకేజ్డ్‌ బియ్యం అందుబాటులోకి వస్తాయి.


సెప్టెంబరు 11 నుంచి 15 వరకూ పెన్షన్లు, రేషన్‌కార్డులు, ఇళ్లస్థలాలు, రైతు భరోసా లబ్ధిదారులను వలంటీర్ల గుర్తిస్తారు. సెప్టెంబర్ 15 నుంచి 30 వరకు పథకాల అమలు తీరుపై సమీక్ష, శిక్షణ, ఉంటుంది. అక్టోబర్ 2న గ్రామ, వార్డు సచివాలయాలను సీఎం ప్రారంభిస్తారు. శ్రీకాకుళం, విజయనగరంలో రేషన్ డోర్ డెలివరీ ప్రారంభిస్తారు.


అక్టోబర్ 2 నుంచి ప్రతి రోజూ ప్రజా సమస్యల పరిష్కారానికి స్పందన కార్యక్రమం నిర్వహిస్తారు. 60 నుంచి 65 ఏళ్ల వయస్సు ఉన్నవారికి కొత్తగా పెన్షన్లు మంజూరు చేస్తారు. అక్టోబర్‌ 15 నుంచి రైతు భరోసా పంపిణీ చేపడుతారు. అక్టోబర్ నుంచి అన్ని సంక్షేమ పథకాల కొత్త లబ్ధిదారుల ఎంపిక ఉంటుంది. ఇదీ జగన్ అమలు చేయదలచుకున్న పక్కా ప్లాన్.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: