సుష్మా పార్థివ దేహం చూసి.. కంటతడిపెట్టిన కిషన్ రెడ్డి..!

Chakravarthi Kalyan

బీజేపీ సీనియర్ నేత సుష్మా స్వరాజ్ పార్థివ దేహం చూసి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కంటతడి పెట్టారు. సుస్మా స్వరాజ్ గారు ఇకలేరు అనే వాస్తవం జీర్ణించుకోలేమంటూ కన్నీరు మున్నీరయ్యారు. సుష్మాజీ నాకు చిన్నమ్మ … నాకే కాదు యావత్తు తెలంగాణకు ఆమె ఎప్పటికి చిన్నమ్మే అంటూ ఆమె సేవలను గుర్తు చేసుకున్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.


తెలంగాణ ప్రజల ఆకాంక్షలను గుర్తించి రాష్ట్రం వచ్చేలా చేసిన ఆమె కృషి ఎన్నటికీ మరువలేమన్నారు కిషన్ రెడ్డి. ప్రజాసమస్యలపై ఆమె స్పందించే తీరు మాలాంటి వారందరికి స్ఫూర్తి.. సుష్మాజీ ఆత్మకు శాంతి కలగాలని కోరుకొంటు వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను .. అని కిషన్ రెడ్డి ప్రకటించారు.


కిషన్ రెడ్డి అంతగా కదిలిపోయారంటే.. అందుకు కారణం లేకపోలేదు.. తెలంగాణ సాకారంలో సుష్మా స్వరాజ్ పోషించిన పాత్ర తక్కువేమీ కాదు.. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి సుష్మ సంపూర్ణంగా మద్దతిచ్చారు. తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టిన సమయంలోనూ ఆమె మాట లేదు. 2009 నుంచి 2014 వరకు లోక్‌సభలో ప్రతిపక్ష నాయకురాలిగా ఆమె ఉండటం తెలంగాణ ఏర్పాటుకు బాగా పనికొచ్చింది.


తెలంగాణ ఉద్యమ సమయంలో సుష్మా స్వరాజ్.. తెలంగాణవాదానికి ఎప్పుడూ అండగానే నిలిచారు. ఢిల్లీలో జరిగిన తెలంగాణ ఉద్యమ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొన్నారు. ఉద్యమ సమయంలో ఆమె తెలంగాణలోనూ పర్యటించి పూర్తి మద్దతు తెలిపారు. తెలంగాణ బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందే సమయంలో.. ఆమె ప్రసంగం అందరికీ గుర్తుండి పోతుంది.


తెలంగాణ ఇచ్చినందుకు ఆ అమ్మ సోనియానే కాదు.. ఈ చిన్నమ్మనూ గుర్తుంచుకోండి’’.. అంటూ ఉద్వేగపూరితంగా ప్రసంగించారు. అందుకే ఆమె తెలంగాణకు చిన్నమ్మగా మారింది. కిషన్ రెడ్డికి సుష్మాతో అనుబంధం పెరిగేందుకు తెలంగాణ ఉద్యమం కూడా కొంత తోడ్పడింది. అందుకే సుష్మా మరణంతో కిషన్ రెడ్డి అంతగా కదలిపోయారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: