జగన్, కేసీఆర్ : ఆంధ్రా, తెలంగాణ భాయీ భాయీ! మంచిదేనా?

Chakravarthi Kalyan
ఆంధ్ర, తెలంగాణ.. కొన్నేళ్లుగా.. ఈ రెండు ప్రాంతాల వారి మధ్య వైరుధ్యాలు, వైషమ్యాలు ఎన్నో. అనేక విషయాల్లో ఈ రెండు ప్రాంతాల వారి మధ్య వాగ్యుద్దాలు నడిచేవి. తెలంగాణ ఉద్యమ సమయంలో అయితే ఈ పరిస్థితి పతాక స్థాయిలో ఉండేది. కష్టమో, నష్టమో.. ఆనందమో.. మొత్తానికి రెండు రాష్ట్రాలు ఐదేళ్ల క్రితం విడిపోయాయి. 

రాష్ట్రాలు విడిపోయినా.. ఇరు ప్రాంతాల మధ్య ప్రత్యేకించి నాయకుల మధ్య అంతరాలు పోలేదు. అందుకు కారణం చంద్రబాబు, కేసీఆర్ ఉప్పు,నిప్పుగా ఉండటం.. ఒకరి రాజకీయ అవసరాల కోసం మరొకరిపై విమర్శలు చేయడం కొనసాగింది. మొన్నటి ఎన్నికల ముందైతే.. చంద్రబాబు, పవన్.. ఏపీలో ఆంధ్రా సెంటిమెంట్ రగిల్చేందుకు విఫలయత్నం చేశారు. ఈ విబేధాల కారణంగా ఆంధ్రా, తెలంగాణ మధ్య కొన్ని సమస్యలు అపరిష్కృతంగా ఉండిపోయాయి.  


కానీ ఇప్పుడు సీన్ మారిపోయింది. జగన్ సీఎం అయ్యాక.. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య స్నేహ పరిమళాలు వెదజల్లుతున్నాయి. జగన్ తన ప్రమాణ స్వీకారానికి కేసీఆర్ ఇంటికి వెళ్లి ఆహ్వానించడం.. కేసీఆర్ ఆ ఆహ్వానాన్ని మన్నించి ప్రమాణ స్వీకారానికి విచ్చేసి ఆశీర్వదించడం మంచి సంకేతాలే ఇచ్చాయి. 

ఇప్పుడు తాజాగా గవర్నర్ సమక్షంలోనే జగన్, కేసీఆర్ భేటీ అయ్యి అనేక అంశాలపై చర్చించుకోవడం హర్షనీయం. ఈ చర్చల్లో కొన్ని సమస్యలు కూడా పరిష్కారం దిశగా అడుగులు వేస్తున్నాయి. ఇన్నాళ్లు కేవలం పట్టుదలల కారణంగా అపరిష్కృతంగా ఉన్న సమస్యల చిక్కుముళ్లు వీడుతున్నాయి. 

ప్రత్యేకించి ఉద్యోగుల విభజనకు తొలి ప్రాధాన్యం ఇవ్వాలని జగన్, కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఇరు రాష్ట్రాల అధికారులతో సంయుక్తంగా కమిటీ వేసుకొని, పరస్పర అంగీకారంతో రెండు రాష్ట్రాల్లోని ఉద్యోగులను స్థానికత ఆధారంగా బదిలీలు చేసుకుందామని ఒప్పందానికి వచ్చారు. ఇరు రాష్ట్రాల మధ్య విద్యుత్‌ బకాయిల వివాదం కూడా పరిష్కరించుకోవడానికి ఆమోదం కుదిరింది. సో.. ఇక ఆంధ్రా, తెలంగాణ భాయీ.. భాయీ.. అన్నమాట. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: