పవన్‌ కోసం ఆ టీడీపీ నేతను చంద్రబాబు నిండా ముంచేశారా...!

VUYYURU SUBHASH
ఏపీలో జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ను ఎలాగైనా అసెంబ్లీకి పంపించాలన్న కృతనిశ్చయంతో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు ఆయన కోసం తన సొంత పార్టీకి చెందిన ఓ సిట్టింగ్‌ ఎమ్మెల్యేను బలి చేశారన్న చర్చలు టీడీపీ వర్గాల్లోనే వినిపిస్తున్నాయి. విశాఖపట్నం జిల్లాలోని గాజువాక ఇప్పుడు హాట్‌ హాట్‌ సీటుగా ఉంది. అక్కడ నుంచి పవన్‌ కళ్యాణ్‌ పోటీ చేస్తున్నారు. పవన్‌ తన సొంత జిల్లా పశ్చిమగోదావరి జిల్లాలోని భీమవరంతో పాటు గాజువాక నుంచి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. భీమవరంలో పవన్‌ ఎలాగో గెలిచే అవకాశం లేదన్న ప్రచారం జరుగుతోంది. అక్కడ వైసీపీ అభ్యర్థి గ్రంథి శ్రీనివాస్‌ చాలా స్ట్రాంగ్‌గా ఉన్నారు. మరో వైపు టీడీపీ నుంచి సిట్టింగ్‌ ఎమ్మెల్యే పులపర్తి అంజిబాబు గత రెండు ఎన్నికల్లోనూ వరుస విజయాలు సాధిస్తున్నారు. వీరిద్దరూ బలంగా ఉండడంతో వీరిద్దరి మధ్య‌ పోటీ ఇచ్చే పరిస్థితి లేక చేతులు ఎత్తేసిన పవన్‌ ఇప్పుడు గాజువాక మీదే ప్రధానంగా దృష్టి సారించారు. 


వాస్తవంగా చూస్తే గాజువాకలో వైసీపీ, టీడీపీ చాలా బలంగా ఉన్నాయి. ఈ నియోజకవర్గం నుంచి పవన్‌ పోటీ చెయ్యడానికి ప్రధాన కారణం పవన్‌ సొంత సామాజికవర్గమైన కాపు ఓటర్లు ఎక్కువ సంఖ్యలో ఉండడమే. 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం నుంచి సైతం ఆ పార్టీ తరపున పోటీ చేసిన చింతలపూడి వెంకటరామయ్య విజయం సాధించారు. కాపులతో పాటు యువత ఓట్లు, పవన్‌ క్రేజ్‌ ఎక్కువగా ఉండడంతో వాటినే నమ్ముకుని పవన్‌ ఇక్కడ రంగంలో ఉన్నారు. టీడీపీ సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా ఉండి, పార్టీ సంస్థాగతంగా బలంగా ఉన్నా ఈ సీటుపై చంద్రబాబు ఎందుకు దృష్టి పెట్టలేదన్న ప్రశ్నకు పరోక్షంగా పవన్‌కు సహకరించేందుకే ఈ పని చేశారా ? అన్న సందేహం రాకమానదు. గాజువాకలో ప్రచారం చెయ్యమని టీడీపీ అభ్యర్థి పల్లా శ్రీనివాస్ బ‌తిమలాడుకున్నా చంద్రబాబు పట్టించుకోలేదని టాక్‌. 


ఇదిలా ఉంటే అక్కడ టీడీపీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్‌పై పార్టీ సీనియర్‌ నేతలు, మాజీ కార్పొరేటర్లు తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారు. ఇప్పుడు వీరంతా ఎమ్మెల్యే ఓటు పవన్‌కు, ఎంపీ ఓటు భరత్‌కు వేసేలా తెర వెనక రాజకీయం నడుపుతున్నారట. టీడీపీలోనే అస‌మ్మ‌తితి వర్గాలు, కొన్ని స‌మ్మ‌తి వర్గాలు సైతం పవన్‌ గెలుపు కోసం పని చేసేలా వాళ్లపై ఒత్తిడి పని చేస్తున్నట్టు బోగట్టా. పల్లాపై తీవ్ర వ్యతిరేకంగా ఉన్న కొందరు సెటిలర్‌ పార్టీ నాయకులు సైతం పల్లా మళ్లీ గెలవకూడదని ఆయన గెలిస్తే తమకు రాజకీయంగా మరిన్ని ఇబ్బందులు తప్పవన్న భవనతో ఉన్నారు. సొంత పార్టీలోనే చాలా మంది జనసేనకు సపోర్ట్‌ చేస్తుండడంతో పల్లా విజయ అవకాశాలు బాగా తగ్గిపోతాయని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇక చంద్రబాబు విశాఖకు ఎన్నికల ప్రచారానికి చాలా సార్లు వచ్చినా గాజువాక మాత్రం వెళ్లలేదు. అక్కడ పవన్‌ పోటీ చేస్తుండడంతో ఆయనకు పరోక్షంగా టీడీపీ మద్దతు ఉందని అందుకే బాబు అక్కడ ప్రచారం చెయ్యలేదని విశాఖలో జోరుగా చర్చ నడుస్తోంది. పవన్‌ కోసమే చంద్రబాబు అక్కడ సిట్టింగ్‌ ఎమ్మెల్యే శ్రీనివాస్‌ను బలి చేస్తున్నారా ? అన్న చర్చ రాజకీయ వర్గాల్లోనూ వినిపిస్తోంది.


పవన్‌కు టీడీపీ సపోర్ట్‌తో ఎవరికి లాభం..?
ఇక గాజువాకలో ప్రస్తుతం జరుగుతున్న ట్రెండ్‌ను బట్టీ చూస్తే టీడీపీలో చాలా మంది పవన్‌కు పరోక్షంగా సపోర్ట్‌ చేస్తున్నారు. ఎవరు అవునన్నా కాదన్నా ఇది నిజం. చివరకు టీడీపీ అధిష్టానం సైతం పవన్‌ గెలిచేలా తన వంతు సాయం చేస్తుందన్న సందేహాలు ఆ పార్టీ వాళ్లకే ఉన్నాయి. ఇక వైసీపీ విషయానికి వస్తే గత రెండు ఎన్నికల్లోనూ పోటీ చేసి ఓడిపోతూ వస్తున్న తిప్పల నాగిరెడ్డిపై భయంకరమైన సానుభూతి పవనాలు కనిపిస్తున్నాయి. 2009 ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓడిన ఆయన గత ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసి 75,000 ఓట్లు తెచ్చుకున్నారు. గాజువాక నియోజకవర్గంలో మొత్తం రెండున్నర లక్షల మంది ఓటర్లు ఉన్నారు. టీడీపీ, జనసేన మధ్య యుద్ధంలో తాను బయట పడతానన్న ధీమాలో ఆయన ఉన్నారు. ఆ రెండు పార్టీల అంతర్గత కల‌హాలతో మెజారిటీ ఓటర్లు తనవైపే ఉన్నారని తాను తప్పకుండా గెలుస్తానన్న ధీమాతో ఆయన ఉన్నారు. ఏదేమైన గాజువాకలో టీడీపీ వ్యవహరిస్తున్న తీరు ఆ పార్టీ అభ్యర్థికే మైనెస్‌కాగా పవన్‌కు చాలా ప్లస్‌ అయ్యేలా కనిపిస్తోంది.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: